TG SSC Exams 2025 : మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
TG SSC Exams 2025 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
ఉత్తమ ఫలితాల కోసం..
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో.. విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో.. విద్యార్థులకు సెలబస్ పూర్తి, పరీక్షల సన్నద్ధత, విద్యాశాఖ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులు ఫోకస్ పెడుతున్నారు.
స్పెషల్ ఫోకస్..
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సిలబస్‌పై ప్రత్యేక దృష్టి సారించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ కార్యాచరణ ప్రకారం 95 శాతం సిలబస్ పూర్తయ్యిందని.. డిసెంబరు 31 వరకు మొత్తం సిలబస్ పూర్తవుతుందని అంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో ప్రిపరేషన్, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెబుతున్నారు.
సబ్జెక్టుల వారీగా..
టెన్త్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులతో పాటు నవంబరు నుంచి ఉదయం పూట ఒక గంటపాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జనవరి 2 నుంచి మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు ప్రత్యేక తరగతులకు ప్రణాళిక రూపొందించారు. వారం చివరన స్లిప్ టెస్టులు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
బాధ్యత వారిదే..
స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. సబ్జెక్టు ఉపాధ్యాయులను సెప్టెంబరు నెలలోనే సర్దుబాటు చేశారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించారు. ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
అటు ఫలితాలపై పూర్తిగా ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలని ఇటీవల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫలితాల మెరుగుదలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో తరచూ సమావేశాలు నిర్వహించి జిల్లా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.