AP SSC Exams: పది పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం, మీడియం ఎంపిక చేసుకునే అవకాశం..ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు..-key decision by the education department on ssc exams possibility to choose medium in ssc exams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Exams: పది పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం, మీడియం ఎంపిక చేసుకునే అవకాశం..ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు..

AP SSC Exams: పది పరీక్షలపై విద్యాశాఖ కీలక నిర్ణయం, మీడియం ఎంపిక చేసుకునే అవకాశం..ఫీజు చెల్లింపుకు గడువు పొడిగింపు..

AP SSC Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీపి కబురు చెప్పింది. 2025 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ భాషలో పరీక్షలు రాయాలనే ఆప్షన్ ఇవ్వనుంది.ఇంగ్లీష్ మీడియం బోధనతో కొందరు వాటికి అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ తీసుకొచ్చారు.

ఏపీ పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పొడిగింపు

AP SSC Exams: ఏపీ పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీపికబురు చెప్పింది. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నచ్చిన భాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించింది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమకు అనువైన భాషలో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఈఓలు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అప్రమత్తం చేయాలని ఆదేశించింది.

ఇప్పటికే పదో తరగతి పరీక్షల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు త్వరలో పరీక్ష రాసే భాషను ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. 8,9 తరగతులు ఇంగ్లీష్‌ మీడియంలో చదివిన విద్యార్థులు వీలైనంత వరకు అదే భాషలో పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది.

పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పొడిగింపు…

పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు పెంపును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల పరీక్ష ఫీజులను నవంబర్ 26వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ చెల్లించవచ్చు. నామినల్ రోల్స్‌ కూడా నవంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఫీజుల చెల్లింపు, నామినల్స్ రోల్స్‌ అప్లోడ్‌ చేయవచ్చు. రూ.200లేట్‌ ఫీజుతో డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు ఫీజులు చెల్లించి అప్లికేషన్లు, నామినల్ రోల్స్ అప్లోడ్ చేయవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించి నామినల్ రోల్స్ అప్లోడ్ చేయవచ్చు.

ప్రతి పాఠశాల తరపున హెడ్ మాస్టర్‌, ప్రిన్సిపల్‌ పరీక్ష ఫీజులను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌ సైట్ ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల చెల్లింపు గడువు పొడిగించరని విద్యాశాఖ స్పష్టం చేసింది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఫీజులు చెల్లించాలని, గడువు ముగిసే సమయంలో ఫీజులు చెల్లించేందుకు ప్రయత్నిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సూచించారు. సర్వర్‌పై ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లింపు, నామినల్ రోల్స్‌ను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు.

అధికారిక వెబ్ సైట్ - https://bse.ap.gov.in/

ఫీజుల వివరాలు…

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సప్లిమెంటరీ అభ్యర్థులు అయితే… 3 పేపర్ల వరకు రూ.110 కట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125గా నిర్ణయించారు. ఇక వయసు తక్కువగా ఉండి ఎగ్జామ్స్ కు హాజరయ్యే వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక రాష్ట్రంలో గ‌త మూడేళ్ల విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్‌తోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇదే విషయంపై ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ విద్యా సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు కొత్త సిల‌బ‌స్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వెబ్‌సైట్‌లో ప్ర‌శ్నాప‌త్రాలు, మోడ‌ల్ పేప‌ర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్‌లోడ్ చేశారు.

ప‌దో త‌ర‌గ‌తి 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవ‌త్స‌రాల్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివి ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు పాత సిల‌బ‌స్ ప్ర‌కారమే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ మూడు సంవ‌త్స‌రాల్లో పదో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఈ ఏడాది ఫెయిల్ అయిన‌ స‌బ్జెట్ల రాయ‌ల‌నుకుంటే వారు పాత సిల‌బ‌స్ ప్రకార‌మే రాయ‌డానికి అవ‌కాశం ఉంది. ప్రైవేట్‌, రీ ఎన్‌రోల్ చేసుకున్న‌ విద్యార్థులు, ఆయా సంవ‌త్స‌రాల్లో ఏ సిల‌బ‌స్ ప్ర‌కారం అయితే ప‌రీక్ష‌లు రాశారో, ఈ ఏడాది ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో కూడా వారికి పాత సిల‌బ‌స్ వ‌ర్తిస్తుంది.

ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం (2024-25) ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మాత్రం మారిన కొత్త సిల‌బ‌స్ ప్ర‌కారం ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఉంటాయి. అందుకు సంబంధించిన ప్ర‌శ్నా ప‌త్రాలు, బ్లూ ప్రింట్‌, ఏడు పేప‌ర్ల‌కు సంబంధించి ప్ర‌శ్న‌ల వారీగా మార్కుల వెయిటేజీ, మోడ‌ల్ పేప‌ర్ల‌ను పాఠ‌శాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లో ఉంచారు.