Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి వర్షసూచన-రైతులు బీఅలర్ట్
Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా అదే ప్రాంతంలో అల్పపీడనం విస్తరించి ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే నాలుగు రోజుల్లో (బుధవారం నాటికి) శ్రీలంక-తమిళనాడు తీరాల నుంచి నైరుతి బంగాళాఖాతానికి వెళ్లవచ్చు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలో బుధ, గురువారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిచే అవకాశం ఉంది. శనివారం నుంచి బుధవారం వరకు ఆగ్నేయ బంగాళాఖాతాలంలోకి, సోమవారం నుంచి గురువారం వరకు నైరుతి బంగాళాఖాతం, బుధ, గురువారాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది.
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 12వ తేదీన ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
డిసెంబర్ 08న వాతావరణం :
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవలి ఫెంగల్ తుపాను రైతులను భయపెట్టింది. ఫెంగల్ తుపాను ఏపీలోని నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపింది. సరిగ్గా వరి కోతల సమయంలో తుపాను ఏర్పడుతూ రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఫెంగల్ తుపాను తప్పిపోయిందని ఆనందించిన రైతులను మరో అల్పపీడనం భయపెడుతోంది. ముందుజాగ్రత్తగా రైతులు తమ ఉత్పత్తులను కాస్త అటు ఇటుగా ధరలకు విక్రయించారు. ఏపీలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
సంబంధిత కథనం