ICC Champions Trophy: పాకిస్థాన్‌కు షాక్.. హైబ్రిడ్ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కానీ..-icc champions trophy 2025 icc approves hybrid model pakistan dubai to host mega tournament ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Icc Champions Trophy: పాకిస్థాన్‌కు షాక్.. హైబ్రిడ్ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కానీ..

ICC Champions Trophy: పాకిస్థాన్‌కు షాక్.. హైబ్రిడ్ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కానీ..

Hari Prasad S HT Telugu
Dec 13, 2024 08:33 PM IST

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లోనే జరగనుంది. ఇండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరగనున్నాయి. ఇక 2026 టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ కూడా ఇండియాకు రామని తేల్చి చెప్పింది.

పాకిస్థాన్‌కు షాక్.. హైబ్రిడ్ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కానీ..
పాకిస్థాన్‌కు షాక్.. హైబ్రిడ్ విధానంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కానీ.. (HT_PRINT)

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి పాకిస్థాన్ కూడా అంగీకరించింది. దీని ప్రకారం ఈ మెగా టోర్నీలో ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. మిగిలిన మ్యాచ్ లు పాకిస్థాన్ లోని మూడు వేదికల్లో ఉంటాయి. ఇక 2026 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో పాకిస్థాన్ ఆడే మ్యాచ్ ఇండియా బదులు కొలంబోలో జరగనుంది.

పాకిస్థాన్, దుబాయ్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వివాదానికి తెరపడింది. అందరినీ ఒప్పిస్తూ ఐసీసీ ఈ మెగా టోర్నీ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా డిమాండ్ చేసినట్లే ఈ టోర్నీ హైబ్రిడ్ విధానంలో జరగనుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియా మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించడానికి పాక్ అంగీకరించింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కు ఎలాంటి ఆర్థిక పరిహారం కూడా చెల్లించడం లేదు.

అయితే 2027 తర్వాత ఓ ఐసీసీ మహిళల టోర్నమెంట్ ను మాత్రం పాకిస్థాన్ కు కేటాయించడానికి ఐసీసీ అంగీకరించింది. ఇక 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ టీమ్ కూడా ఇండియాకు రావడం లేదు. ఈ మెగా టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా ఉన్న శ్రీలంకలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ.. ముగ్గురూ ఈ ఒప్పందంపై సంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య సద్దమణిగింది.

పాకిస్థాన్‌లో పది మ్యాచ్‌లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్ మొత్తం పది మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది. అయితే ఇండియా ఆడే మూడు లీగ్ మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరుగుతాయి. ఇందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. అంతేకాదు ఒకవేళ ఇండియా సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే ఉంటాయి. ఇండియన్ టీమ్ లీగ్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తే పాకిస్థాన్ లోని లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.

ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడానికి మొదటి నుంచీ పాకిస్థాన్ విముఖతగా ఉంది. ఒకవేళ ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాకపోతే.. తాము కూడా ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు వెళ్లబోమని హెచ్చరించింది. తమ మ్యాచ్ లను కొలంబోలో ఆడతామని పీసీబీ ప్రతిపాదించింది. ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరగనుంది. ఇందులో మొత్తం 8 టీమ్స్ పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపు నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ వెళ్తాయి. గతేడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్ కూడా ఇలా హైబ్రిడ్ విధానంలోనే జరిగిన విషయం తెలిసిందే. ఇండియా మ్యాచ్ లతోపాటు సెమీఫైనల్, ఫైనల్ కొలంబోలో జరిగాయి. 2017 తర్వాత తొలిసారి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. చివరిసారి జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది.

Whats_app_banner