USA news: అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వం అంటే ఏమిటి? ట్రంప్ దానిని తొలగిస్తున్నారా?-what is us birthright citizenship and can trump end it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa News: అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వం అంటే ఏమిటి? ట్రంప్ దానిని తొలగిస్తున్నారా?

USA news: అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వం అంటే ఏమిటి? ట్రంప్ దానిని తొలగిస్తున్నారా?

Sudarshan V HT Telugu
Dec 19, 2024 05:45 PM IST

USA news: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనది అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించివేయడం. అందులో భాగంగా, బర్త్ రైట్ సిటిజన్ షిప్ సదుపాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ (AP)

US birthright citizenship: జనవరి 20న తాను అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తరువాత అక్రమ వలసలపై అణచివేతలో భాగంగా జన్మహక్కు ద్వారా లభించిన పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేయాలనుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అధ్యక్షుడిగా ట్రంప్ కు ఉన్న అధికారాలు అందుకు అనుమతిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

జన్మహక్కు పౌరసత్వం అంటే ఏమిటి?

యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన వ్యక్తులు ఎవరైనా.. వారు పుట్టుకతోనే అమెరికా పౌరుడిగా పరిగణించబడతారు. ఇది 1868 లో రాజ్యాంగంలో చేర్చిన 14 వ సవరణ పౌరసత్వ క్లాజ్ నుండి వచ్చింది. ఈ సవరణ ఇలా చెప్తుంది: "యునైటెడ్ స్టేట్స్ లో జన్మించిన, దాని అధికార పరిధికి లోబడి ఉన్న వ్యక్తులందరూ యునైటెడ్ స్టేట్స్, వారు నివసిస్తున్న రాష్ట్ర పౌరులుగా పరిగణించబడుతారు" 1952 ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం కూడా ఇదే తరహాలో అమెరికా పౌరులను నిర్వచిస్తుంది.

అక్రమ వలసలతో సమస్య

2022 జనవరిలో అమెరికాలో 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేసింది. ఈ సంఖ్యను కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు 13 మిలియన్ల నుండి 14 మిలియన్ల వరకు పెంచారు. అమెరికాలో జన్మించిన వారి పిల్లలను ప్రభుత్వం అమెరికా పౌరసత్వం ఉన్నవారిగా పరిగణిస్తుంది. అందువల్ల తమ సంతానానికి అమెరికా పౌరసత్వం కల్పించడం కోసం విదేశీ మహిళలు అమెరికాకు అక్రమంగా వస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

మినహాయింపులు ఉన్నాయా?

అవును. అమెరికాలో విదేశాల తరఫున దౌత్యవేత్తలుగా విధులు నిర్వర్తిస్తున్నవారికి అమెరికాలో జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. ఆ దౌత్య వేత్తలు యునైటెడ్ స్టేట్స్ అధికార పరిధికి లోబడి ఉండరు కనుక వారి పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్ షిప్ వర్తిచదు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

  • అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారి పిల్లలకు పౌరసత్వ నిబంధన వర్తిస్తుందో లేదో సుప్రీంకోర్టు (supreme court) స్పష్టంగా ప్రస్తావించలేదు. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వానికి సంబంధించిన కేసు 1898 నుండి ఉంది. ఆ కేసులో చైనా నుండి చట్టబద్ధంగా వలస వచ్చిన ఒక వ్యక్తికి అమెరికాలో 1873 లో జన్మించిన కుమారుడు యు.ఎస్ పౌరుడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, చైనా నుంచి వలసలపై తీవ్ర ఆంక్షలు విధించిన సమయంలో, ఆ వ్యక్తి కుమారుడు వాంగ్ కిమ్ ఆర్క్ ను చైనా పర్యటన నుంచి తిరిగివస్తుండగా, అమెరికాలోకి రీఎంట్రీ నిరాకరించారు.
  • అమెరికాలో జన్మించిన జాన్ ఎల్క్ స్థానిక అమెరికన్ తెగకు చెందిన వ్యక్తిగా జన్మించినందున అతను పౌరుడు కాదని, అందువల్ల అమెరికా అధికార పరిధికి లోబడి ఉండడని 1884లో ఓటరు నమోదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ 1924 లో స్థానిక అమెరికన్లకు అమెరికా పౌరసత్వాన్ని విస్తరించింది.

జన్మహక్కు పౌరసత్వం వ్యతిరేకుల అభిప్రాయం ఏమిటి?

దేశంలో జన్మించిన ప్రజలందరూ పౌరులుగా ఉండాలని చట్టసభ సభ్యులు కోరుకుంటే, పౌరులు యునైటెడ్ స్టేట్స్ యొక్క "అధికార పరిధికి లోబడి ఉండాలి" అని పేర్కొంటూ 14 వ సవరణలో క్లాజును చేర్చేవారు కాదని కొందరు పండితులు వాదిస్తున్నారు. ఆ క్లాజ్ చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వ్యక్తులను, వారి యూఎస్ (usa news telugu) లో జన్మించిన పిల్లలను మినహాయించిందని వారు వాదిస్తున్నారు. చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్న తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలు యుఎస్ అధికార పరిధికి లోబడి ఉండరని, అందువల్ల వారికి పౌరసత్వం ఇవ్వకూడదని పేర్కొంటూ 2022 లో పార్లమెంటులో ఒక బిల్లను ప్రవేశపెట్టారు.

ట్రంప్ జన్మహక్కు పౌరసత్వాన్ని అంతం చేయగలరా?

పౌరసత్వాన్ని నియంత్రించే అధికారాన్ని రాజ్యాంగం కాంగ్రెస్ కు ఇస్తుంది. ఏ అధ్యక్షుడు కూడా కార్యనిర్వాహక ఉత్తర్వులను ఉపయోగించి పౌరసత్వ నియమాలను పునర్నిర్వచించడానికి ఇప్పటివరకు ప్రయత్నించలేదు. కానీ, ట్రంప్ (donald trump) అలా చేస్తామని హామీ ఇస్తున్నారు. జన్మహక్కు పౌరసత్వాన్ని పునర్నిర్వచించడానికి ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయవచ్చు. అయితే, ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును న్యాయస్థానాలలో సవాలు చేసే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చివరకు ఇది ఈ సమస్యను సుప్రీంకోర్టు వైపు మళ్లించి జన్మహక్కు పౌరసత్వానికి ఎవరు అర్హులో నిర్ణయించే అధికారాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చే అవకాశముంది. రాజ్యాంగం జన్మహక్కు పౌరసత్వాన్ని పరిరక్షిస్తుందని న్యాయస్థానాలు నిర్ణయిస్తే, రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లో మూడింట రెండొంతుల ఆమోదం, మూడొంతుల రాష్ట్ర సభల ఆమోదం అవసరం. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 1992 నుంచి అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించలేదు.

Whats_app_banner