Donald Trump : అధిక సుంకాలపై భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ సందేశం.. మేం కూడా అదే పనిచేస్తాం-donal trump message to india over high tariffs says they tax us we tax them details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump : అధిక సుంకాలపై భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ సందేశం.. మేం కూడా అదే పనిచేస్తాం

Donald Trump : అధిక సుంకాలపై భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ సందేశం.. మేం కూడా అదే పనిచేస్తాం

Anand Sai HT Telugu
Dec 18, 2024 10:43 AM IST

Donald Trump On Tax : అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్ను విధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మేం కూడా అధిక పన్ను విధిస్తామని స్పష్టం చేశారు.

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో) (AP)

మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపటనున్నారు డోనాల్డ్ ట్రంప్. ఈ సమయంలో మరోసారి సుంకాల విషయంపై మాట్లాడారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధించే భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార పన్ను విధించే యోచనలో ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విలేకరులతో మాట్లాడుతూ ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై పన్ను విధిస్తే అమెరికా దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

'వారు మాకు పన్ను వేస్తే, మేం వారికి అదే మొత్తంలో పన్ను విధిస్తాం. వారు మాకు పన్ను విధిస్తారు. వాటిపై మేం పన్ను విధిస్తాం. దాదాపు అన్ని సందర్భాల్లోనూ వారు మాపై పన్ను విధిస్తున్నారు. మేము వారిపై పన్ను విధించడం లేదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా మీద భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక పన్ను విధిస్తున్న అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. 100, 200 శాతం పన్ను విధిస్తున్నారని, దేనికైనా ప్రతీకార చర్య ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ వంద శాతం పన్ను విధిస్తే.. మేం కూడా వేస్తాం కదా? అని మాట్లాడారు. దేశాలు ఎలా పన్ను విధిస్తాయో మేం కూడా అలాగే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గతంలో భారత్‌ను ట్రంప్ టారీఫ్ కింగ్ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

'పరస్పరం అనే పదం ముఖ్యమైనది ఎందుకంటే ఎవరైనా మాకు పన్ను విధిస్తే మేం విధిస్తాం. భారతదేశం మాకు 100 శాతం ఛార్జీలు వసూలు చేస్తే మేము వారికి వసూలు చేయలేమా? వారు పంపుతారు. మేం వారికి పంపుతాం.' అని ట్రంప్ చెప్పారు.

చైనాతో వాణిజ్య ఒప్పందంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్ని అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్, బ్రెజిల్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై వాణిజ్య కార్యదర్శిగా ఎన్నికైన హోవార్డ్ లుట్నిక్ కూడా మరోసారి ప్రస్తావించారు. కొత్త పరిపాలనలో వాణిజ్య విధానాలలో పరస్పర చర్య తప్పకుండా ఉంటుందని లుట్నిక్ పేర్కొన్నారు. మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారనేదే ముఖ్యమని స్పష్టం చేశారు..

ఇదిలావుండగా, పదవీ విరమణ చేస్తున్న బైడెన్ ప్రభుత్వం మంగళవారం భారత్ అమెరికా సంబంధాల గురించి మాట్లాడింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో కూడా ద్వైపాక్షిక మద్దతు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. 'అమెరికా-భారత్ సంబంధాలపై మేం చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాం. డెలావేర్లో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సమావేశంతో గత కొన్ని నెలలుగా మేం చాలా ఉన్నత స్థాయిగా ఉన్నాం.' అని డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ క్యాంప్బెల్ వాషింగ్టన్లో కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో చెప్పారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.