LRS Applications : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక అప్డేట్ - సవరణలకు మరోసారి ఛాన్స్, ఇదిగో డైరెక్ట్ లింక్..!
TG Govt Layout Regularization Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం కల్పించింది. వెబ్ సైట్ లోని సిటిజన్ లాగిన్ నుంచే మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలను సమర్పించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టగా…. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు మరో అవకాశం కల్పించింది. కావాల్సిన పత్రాలను ఆన్ లైన్ లోనే సమర్పించేలా.. సవరణకు ఛాన్స్ ఇచ్చింది.
2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న లేఅవుట్లకు మాత్రమే ఎల్‌ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) వర్తిస్తుందని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. 2020 అక్టోబర్ 15లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అనుమతి లేని… చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణ చేసేందుకు విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వలు జారీ అయ్యాయి.
2020లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో... దరఖాస్తుదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది.
75 శాతం దరఖాస్తుల్లో పూర్తి వివరాలు లేనట్లు గుర్తించిన సర్కార్… అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం వద్ద ఉన్న 4,28,832 దరఖాస్తులను పరిశీలించగా.. వాటిలో 60,213 మాత్రమే ఆమోదం పొందినట్లు అధికారులు వెల్లడించారు. సరైన వివరాలు అందజేయని వారు మరోమారు సవరించుకోవాలని తెలిపారు.
అప్ లోడ్ చేసేందుకు మరోసారి ఛాన్స్…!
సిటిజిన్ లాగిన్ లోకి వెళ్లి… సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ పేర్కొంది.
దరఖాస్తుదారులు https://lrs.telangana.gov.in/layouts/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత… అధికారులకు, దరఖాస్తుదారులకు వేర్వేరుగా లాగిన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్లికేషన్ చేసుకున్నవారు lrs.telangana.gov.in ద్వారా సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. వెరిఫైడ్ ఓటీపీపై క్లిక్ చేయగానే…. హోంపేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ అప్లికేషన్స్ అప్ లోడ్ ఆప్షన్ పై నొక్కి…. మీ ప్లాట్ కు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ నిర్ధారిత పత్రం, లేఅవుట్ కాపీ తదితర పత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ 5 ఎంబీలోపే ఉండాలి. ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయటం ద్వారా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి….
- ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు స్టేటస్ కూడా చెసుకోవచ్చు.
- https://lrs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- సిటిజన్ లాగిన్ పై నొక్కి మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కనిపించే అప్లికేషన్ స్టేషన్ ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ కనిపించే వ్యూ ఆప్షన్ పై నొక్కితే మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.