Bhadradri Kothagudem : ఎవరిదీ పాపం..? భద్రాద్రి కొత్తగూడెం శ్మశానవాటికలో పసికందు.!
భద్రాద్రి కొత్తగూడెం శ్మశానవాటికలో పసికందు లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. నవజాత శిశువు వద్దకు వెళ్లి పరిస్థితిని చూసి.. బాలుడిగా గుర్తించారు.
ఇది కలికాలం పుణ్యమా..? కనీస కనికరమే మటు మాయమైందా..? అన్నట్లుగా అమానవీయ ఘటనలు చోటుచేసుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. పేగు తెంచుకు పుట్టిన నెత్తుటి ముద్దను గంటలైనా గడవకముందే మట్టిలో కలిపేసేందుకు తెగించిందో కనికరంలేని అమ్మ. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని న్యూ గుల్లగూడెంలోని శ్మశాన వాటికలో కళ్ళు కూడా సరిగా తెరవని నవజాత శిశువు దర్శనమివ్వడం స్థానికులను నిర్ఘాంతపరిచింది.
గేటు వేసి ఉన్న శ్మశాన వాటికలో నుంచి ఏడుపు వినిపిస్తుండటాన్ని గమనించిన స్థానికులు అటుగా వెళ్లి చూశారు. దీంతో వారికి పురిటి వాసనైనాపోని నవజాత శిశువు తారసపడింది. వెంటనే స్థానికంగా ఉండే రాజకీయ పెద్దలకు ఈ కబురుని చేరవేశారు. స్పందించిన సదరు నాయకులు త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో క్షణాల్లో స్పందించిన పోలీసులు ఆ నవజాత శిశువు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆ శిశువును బాలుడిగా గుర్తించారు. అనంతరం రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి కావాల్సిన తక్షణ వైద్యం అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకున్న అనంతరం సీడీపీఓ ఆధ్వర్యంలో భద్రాచలంలోని శిశు సంరక్షణ గృహానికి తరలించారు.
భారమైందో, బాధ్యత మరిచిందో..?
రక్త మాంసాలు ప్రోదు చేసి నవ మాసాలు మోసి పురిటి నొప్పులను అధిగమించి మరీ శిశువుకు జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను భారం అనుకుందో, బాధ్యత మరిచిందో తెలియదు కానీ గంటల వయసున్న పసి గుడ్డును కర్కశంగా శ్మశాన వాటికలో వదిలి వెళ్ళిపోయింది. కొత్తగూడెంలో ఈ హృదయ విదారక ఘటన చర్చనీయాంశంగా మారింది.
పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అనే కనికరమైనా లేకుండా శ్మశానవాటికలో వదిలి వెళ్లిన వైనాన్ని తలచుకొని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా తల్లి తన పిల్లల పోషణ కోసం నూటికి నూరు పాళ్ళు శ్రమిస్తుంది. కానీ ఈ తల్లి తన శిశువు పోషణ భారం అనుకుందో..? లేక బాధ్యత మరిచిందో కానీ స్మశాన వాసి శివుడి చెంతకు చేర్చి చేతులు దులుపుకుందని కొందరు మండిపడుతున్నారు. శ్మశానంలో లభ్యమైన ఈ నవజాత శిశువుని ఎవరు వదిలి వెళ్లిపోయారు..? కారకులు ఎవరై ఉంటారు..? అనే అంశాలపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.