YS Jagan : ఎవరూ భయపడొద్దు.. మనకూ టైమ్ వస్తుంది, పోరాటానికి సిద్ధం కండి - వైఎస్ జగన్
చంద్రబాబు పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని… స్కామ్‌ల మీద స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలెవరూ భయపడొద్దని, పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన విజన్ 420 కాదని… మేనిఫెస్టోను ఎగ్గొట్టే ప్రణాళిక కాదని దుయ్యబట్టారు. విజన్ పేరుతో రంగురంగుల కథలు చేస్తున్నారని.. బాబు విజన్ చూస్తే ఆశ్చర్యమేస్తుందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి అనంతరపురం జిల్లాలోని నేతలతో సమావేశంలో మాట్లాడిన జగన్… ఎన్డీఏ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
ఆరు నెలలకే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర స్ధాయిలో వ్యతిరేకత కనిపిస్తోందిని జగన్ వ్యాఖ్యానించారు. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదన్నారు. అబద్దాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది తన నమ్మకమని జగన్ ఉద్ఘాటించారు. ఐదేళ్ల మన పాలనలో చరిత్రలో ఎప్పుడూ జరగని మార్పులు చేశామని గుర్తు చేశారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి అమలు చేశామన్నారు.
ఇవాళ ఆరు నెలల గడవకముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయని జగన్ దుయ్యబట్టారు. “ఆరోజు నేను ఎన్నికల్లో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే అని.. ఇవాళ ఆరు నెలల తిరక్క ముందే అదే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా చంద్రబాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది” అంటూ జగన్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగ దొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కామ్‌ల మీద స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ బిల్లుల మీద ఈనెల 27న ఆందోళనకు పిలుపునిచ్చామని జగన్ చెప్పారు. ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు కూడా విడుదల చేయటం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయని.. అయినా డబ్బులు ఇవ్వటం లేదని ఆక్షేపించారు.
మన టైమ్ వస్తుంది - వైఎస్ జగన్
“ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. మనకూ తప్పనిసరిగా టైమ్ వస్తుంది. ప్రజలకు తోడుగా, ప్రజల తరపున వారికి అండగా గొంతు విప్పాల్సిన తరుణమిది. అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతాం. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు ఉంటాయి. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. నన్ను 16 నెలలు పెట్టారు. ప్రతిపక్షం ఉండదు. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. మరలా మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ అండగా ఉంటుంది” అని జగన్ భరోసానిచ్చారు.
సంబంధిత కథనం