AP Liquor Sales : ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు, 55 రోజుల్లో రూ.4677 కోట్ల లిక్కర్ సేల్స్
AP Liquor Sales : ఏపీలో మందుబాబులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నారు. అక్టోబర్ 16న ప్రారంభమైన నూతన మద్యం షాపుల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. 55 రోజుల వ్యవధిలో రూ.4677 కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.
AP Liquor Sales : ఏపీలో మందుబాబులు యమజోష్ లో ఉన్నారు. నాణ్యమైన మద్యం దొరుకుతుండడంతో...గ్లాస్ మీద గ్లాస్ లాగించేస్తున్నారు. దీంతో ఏపీలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల వ్యాపారం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 55 రోజుల వ్యవధిలో 61.63 లక్షల కేసుల లిక్కర్, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించింది. అయితే కూటమి సర్కార్ ఆ విధానానికి స్వస్తి పలికింది. రెండేళ్ల పాటు అమల్లో ఉండే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం...ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచి 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు చేసింది.
రూ.4677 కోట్ల ఆదాయం
రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ దుకాణాల టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. అయితే నిబంధనల ప్రకారం షాపులు పాడుకున్న యజమానులకు 20 శాతం కమిషన్ ఇవ్వాలి. అయితే ఇంకా పాత మద్యమే విక్రయిస్తున్నట్లు చెబుతున్న ఎక్సైజ్ శాఖ...కమిషన్ తక్కువగా ఇస్తుంది. ఇప్పటికైనా 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం షాపుల యజమానుల నుంచి ఒత్తిడి వస్తుంది. 20 శాతం కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు వస్తాయని మద్యం దుకాణాలు యజమానులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు రూ.4,677 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రానున్న రోజుల్లో లిక్కర్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. క్రిస్టమస్, సంక్రాంతి సీజన్ కావడంచో లిక్కర్ సేల్స్ మరింత పెరుగుతాయని అంటున్నారు.
బెల్ట్ షాపులు
ఏపీలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇక ప్రైవేట్ మద్యం పాలసీ ద్వారా అటు షాపుల యజమానులతో పాటు అధికారి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు మంచి ఆదాయం వస్తుందని సమాచారం. దీంతో పాటు ఊరూరా బెల్ట్ షాపులు వెలిశాయి. లైసెన్స్ తీసుకున్న ప్రదేశానికి సమీపంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నారు. బెల్ట్ షాపు పెడితే బెల్డ్ తీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించినా...పరిస్థితి మారడంలేదు. ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తున్నా అదంతా కేవలం నామమాత్రంగానే ఉంటుందనే విమర్శలు లేకపోలేదు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన మద్యంపై కూటమి నేతలు అదే తరహా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన మద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...రేట్ల తగ్గిస్తామన్న హామీ మాత్రం నెరవేరలేదని విమర్శిస్తు్న్నారు. ప్రతిపక్షాలకు మద్యం ఒక కీలక అంశంగా మారుతుంది.
సంబంధిత కథనం