Cubicles Season 4: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Cubicles Season 4: ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేసింది. కార్పొరేట్ ప్రపంచాన్ని కళ్లకు కడుతూ సాగుతున్న క్యూబికల్స్ (Cubicles) వెబ్ సిరీస్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
Cubicles Season 4: కార్పొరేట్ ఆఫీస్ లలో పని చేసే ఉద్యోగుల జీవితాలను కళ్లకు కడుతూ ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగులోనూ అర్థమయ్యిందా అరుణ్ కుమార్, బెంచ్ లైఫ్, వేరే లెవెల్ ఆఫీస్ లాంటి వెబ్ సిరీస్ ఉన్నాయి. అయితే హిందీలో 2019లో ప్రారంభమైన క్యూబికల్స్ (Cubicles) వెబ్ సిరీస్ మాత్రం ఐదేళ్లుగా మూడు సీజన్ల పాటు అలరిస్తూనే ఉంది. తాజాగా గురువారం (డిసెంబర్ 19) నుంచి నాలుగో సీజన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి శుక్రవారం రావాల్సిన ఈ సిరీస్ ఒక రోజు ముందే రావడం విశేషం.
క్యూబికల్స్ నాలుగో సీజన్
క్యూబికల్స్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ సోనీలివ్ (Sonyliv) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఇప్పటి వరకూ మూడు సీజన్లు చూసిన వాళ్లు ఈ నాలుగో సీజన్ కు కూడా ఈ వీకెండ్ చూసేయండి. ఒకవేళ చూసి ఉండకపోతే.. ముందు వాటిని చూసేసి నాలుగో సీజన్ ను ఫాలో అవండి.
మీరు కచ్చితంగా ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ను ఎంజాయ్ చేస్తారు. ఇది ఓ సైనోటెక్ అనే కార్పొరేట్ ఆఫీస్ లోని క్యూబికల్స్ లో కాలం వెల్లదీసే నలుగురైదుగురు ఐటీ ఉద్యోగుల చుట్టూ తిరిగే స్టోరీ. కామెడీతోపాటు వివిధ ఎమోషన్లను ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 8.2 రేటింగ్ ఉంది.
క్యూబికల్స్ వెబ్ సిరీస్ గురించి..
క్యూబికల్స్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019లో వచ్చింది. అప్పటి నుంచి గతేడాది వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. యూత్ మెచ్చే ఎన్నో సిరీస్ లను తెరకెక్కించిన టీవీఎఫ్ ( ది వైరల్ ఫీవర్) నిర్మించిన ఈ క్యూబికల్స్ (Cubicles).. కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసింది. పియూష్ ప్రజాపతి (అభిషేక్ చౌహాన్) అనే ఓ కార్పొరేట్ ఎంప్లాయీ చుట్టూ తిరిగే కథ ఇది.
కథ సరైన విధానంలో చెప్పడం రావాలేగానీ.. ఓ కార్పొరేట్ ఆఫీస్ లో క్యూబికల్స్ అనే ఓ స్క్వేర్ బాక్స్ నుంచి కూడా అద్భుతమైన స్టోరీలు పుడతాయని చెప్పడానికి ఈ వెబ్ సిరీసే ఓ నిదర్శనం. తొలి రెండు సీజన్లలో ఈ పియూష్ ప్రజాపతి ఓ సాధారణ రిసోర్స్ గా జాయినై.. మెల్లగా టీమ్ లీడ్ వరకూ వెళ్లే జర్నీని చూపించింది.
మూడో సీజన్ లో టీమ్ లీడ్ గా పియూష్ ప్రజాపతి ఆ క్యూబికల్స్ లో ఎదుర్కొనే సవాళ్లను చూపించారు. క్యూబికల్స్ మూడో సీజన్ మొత్తం ఓ లీడర్ గా ఎదగాలనుకుంటున్న పియూష్ ప్రజాపతి.. ఆ క్రమంలో ఎదుర్కొనే ఫెయిల్యూర్స్, వాటిని అధిగమించడానికి వేసే ఎత్తుగడలు, ఈ క్రమంలో తన ఫ్రెండ్స్ తోనే ఏర్పడే అభిప్రాయ భేదాలు, చివరికి లీడర్ గా ఎదిగినా.. ఓ ఫ్రెండ్ గా ఓడిపోయిన తీరును మనసుకు హత్తుకునేలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ప్రొఫెషనల్ జీవితంలో ముందడుగు వేయాలంటే.. ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచించాలనే ఓ సందేశాన్ని అంతర్లీనంగా చూపిస్తూ ఈ క్యూబికల్స్ మూడో సీజన్ సాగింది. ఓ ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్ట్, ఓ డెడ్‌లైన్ నుంచి మరో డెడ్‌లైన్ మధ్య నడిచే కార్పొరేట్ లైఫ్ లోని అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు.