ఎక్కువ స్థాయిలో పురుగు మందులు ఉండే పండ్లు కూరగాయలు ఇవే, వీటితో జాగ్రత్త
మనం తినే ఆహారాలలో పురుగు మందులను చల్లి పండిస్తున్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్నింటిలో పెస్టిసైడ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంది.వాటితో జాగ్రత్త.
సమతుల్య ఆహారంలో పండ్లు, కూరగాయలు కూడా ఒక భాగమే. ఇవి లేనిదే ఆరోగ్యకరమైన భోజనం పూర్తికాదు. అయితే ఆధునిక కాలంలో క్రిమిసంహారక మందులు ఎక్కువగా వేసి పండిస్తున్నా పంటలే అధికంగా ఉన్నాయి. వీటిని తినేటప్పుడు పరిశుభ్రంగా నీటితో కడిగి వండి తినాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ అత్యధిక స్థాయిలో పురుగుమందులను కలిగి ఉన్న ఉత్పత్తుల గుర్తించి ఆ జాబితాను విడుదల చేస్తుంది. అలా ఈసారి కూడా ఎనిమిది రకాల ఆహారాల పై ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ చెబుతోంది. వీటిని తినే ముందు లేదా వండే ముందు నీళ్లల్లో ఎక్కువ సేపు నానబెట్టి పరిశుభ్రంగా కడిగి తినాల్సిన అవసరం ఉంది.
పాలకూర
ఆరోగ్యకరమైన ఆహారంలో పాలకూర మొదటి స్థానంలో ఉంటుంది. అయితే దీనిలో పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. పాలకూర నమూనాలను సేకరించి పరిశోధించగా 76% పాలకూర పై పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై ఉండే పెరెత్రిన్ అనే రసాయనం మనుషులకు, జంతువులకు కూడా హానికరమైనదని తెలుస్తోంది. ఇవి మెదడులోని నరాలను దెబ్బతీసే అవకాశం ఉంది. పాలకూర ఆకులను నీటిలో నానబెట్టి పావు గంటసేపు అలా వదిలేయాలి. తర్వాత దాన్ని రెండు మూడుసార్లు చేత్తోనే కడగాలి. ఆ తర్వాతే వీటిని వండాలి.
స్ట్రాబెరీలు
స్ట్రాబెర్రీలు అంటే ఎంతో మందికి ఇష్టం. స్ట్రాబెర్రీలను పరిశోధించగా 99% పండ్లపై పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. ఇంకా భయపెట్టే నిజమేంటంటే స్ట్రాబెరీలపై 30% అధికంగా పదికి మించిన రకాల పురుగుమందులను గుర్తించారు. ఈ అధిక పురుగు మందుల స్థాయిలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. కాబట్టి స్ట్రాబెర్రీలు కూడా తినేముందు నీటిలో అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాతే కడుక్కొని కడిగి తినాలి.
ద్రాక్ష
ద్రాక్ష పండ్లలో 90 శాతం రెండు కన్నా ఎక్కువ పురుగుమందుల రకాల అవశేషాలు కనిపించాయి. ద్రాక్షను కొనుగోలు చేసేటప్పుడు అవి సేంద్రియ పద్ధతిలో పండించినవో కాదో తెలుసుకొని కొనడం ఉత్తమం. ద్రాక్షలో అధిక క్రిమిసంహారక అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగి ఉంటాయి.
పీచెస్
పీచెస్ పండ్లు టేస్టీగా ఉంటాయి. ఈ పండ్లను తీసుకొని పరిశీలించగా ఆ పండు పై 99% వరకు పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. వీటి పై నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రకాల పురుగు మందులు వాడినట్టు కనిపెట్టారు. కాబట్టి సేంద్రియ పద్ధతిలో పండిన పండ్లను తినేందుకు ప్రయత్నించండి.
పియర్స్
పియర్స్ పండును తీసుకొని లాబొరేటరీలో పరిశీలించగా ఆ పియర్స్ పండు పై అరవై ఒక్క శాతం మేర ఐదు కంటే ఎక్కువ రకాల పురుగుమందుల అవశేషాలు కనిపించాయి. ఇవి ఆరోగ్య భద్రతకు హాని కలిగించేవి. అధిక స్థాయిలో ఉన్న ఈ పురుగు మందుల అవశేషాలు శరీరంలో చేరితే చాలా ప్రమాదకరంగా మారతాయి.
ఆపిల్స్
ప్రతి ఇంట్లో కచ్చితంగా తినే పండు ఆపిల్. వీటిని కూడా పురుగుల మందులతోనే పండిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక యాపిల్ పండుకు తీసుకొని పరిశోధించగా దానిపై 90 శాతం మేర రెండు రకాల పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులు గుర్తించారు. ఐరోపాలో నిషేధానికి గురైన డిఫెనిలమైన్ అనే రసాయన పదార్థం ఆపిల్ పండ్ల పై ఉన్నట్టు కనిపెట్టారు. ఇది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. కాబట్టి ఆపిల్ పంటలను కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవే కొనుక్కోవాలి. లేదంటే ఒక అరగంట పాటు ఆపిల్స్ పండ్ల నీటిలో నానబెట్టి చేతులతోనే రుద్ధి కడిగి అప్పుడు తినాలి.
టాపిక్