Strawberry plants: స్ట్రాబెర్రీ మొక్కలను శీతాకాలంలో సులువుగా మీ ఇంటి బాల్కనీలోనే పెంచేయండిలా-grow strawberry plants easily in your home balcony in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Strawberry Plants: స్ట్రాబెర్రీ మొక్కలను శీతాకాలంలో సులువుగా మీ ఇంటి బాల్కనీలోనే పెంచేయండిలా

Strawberry plants: స్ట్రాబెర్రీ మొక్కలను శీతాకాలంలో సులువుగా మీ ఇంటి బాల్కనీలోనే పెంచేయండిలా

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 12:30 PM IST

Strawberry plants: స్ట్రాబెర్రీలు మనకు పండవేమో అనుకుంటారు. నిజానికి కాస్త జాగ్రత్తగా చూసుకుంటే స్ట్రాబెర్రీలు మీ ఇంటి బాల్కనీలో కూడా చక్కగా పండుతాయి. వాటిని ఎలా పెంచాలో తెలుసుకోండి.

కుండీల్లోనే స్ట్రాబెర్రీ పెంపకం
కుండీల్లోనే స్ట్రాబెర్రీ పెంపకం (Amazon)

స్ట్రాబెర్రీలు రుచికరమైన పండ్లలో ఒకటి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే స్ట్రాబెర్రీలను తరచూ తినమని చెబుతుంటారు. చూడగానే ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఇవి నోరూరించేలా ఉంటాయి. వీటిని ఇంటి పెరట్లో పెంచే వారి సంఖ్య చాలా తక్కువ. నిజానికి స్ట్రాబెర్రీలను చాలా సులువుగా పెంచేయొచ్చు. బాల్కనీలో లేదా ఇంటి పెరట్లో స్ట్రాబెర్రీ మొక్కలను సులువుగా ఎలా పెంచాలో తెలుసుకోండి.

స్ట్రాబెర్రీ మొక్కను నేరుగా నర్సరీ నుంచి కొని తెచ్చుకున్నా ఫర్వాలేదు, లేదా స్ట్రాబెర్రీలు తిన్నాక దానిపైన ఉండే విత్తనాలను జాగ్రత్తగా సేకరించి వాటి ద్వారా మొక్కలను పెంచవచ్చు.

స్ట్రాబెర్రీ విత్తనాలను సేకరించి

స్ట్రాబెర్రీలను కొన్న తర్వాత వాటి చర్మం నుండి గింజలను చాలా జాగ్రత్తగా బయటకు తీయాలి. వాటికి చిన్న క్లాత్ పై ఉంచండి. ఆ వస్త్రాన్ని ఒకసారి తడిపి చేతులతోనే పిండి తడిగా ఉండేలా చూసుకోండి. ఆ క్లాత్‌లో ఈ విత్తనాలను పెట్టండి. ఈ విత్తనాలు మొలకెత్తాలంటే తేమ వాతావరణం చాలా అవసరం. అలా వస్త్రంలో కట్టాక గాలి చొరబడని కంటైనర్లో పెట్టి చీకటి ప్రాంతంలో ఉంచండి. అలా ఉంచాక ఆ విత్తనాల నుండి చిన్నచిన్న మొలకలు రావడం మొదలవుతాయి.

కుండీల్లో మెత్తటి మట్టి, కోకోపీట్ చల్లి ఒక్కో కుండీల్లో ఆరు విత్తనాలను నాటండి. మట్టిలో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతులో చిన్న రంధ్రాలు చేసి ఈ విత్తనాలను ఉంచండి. తర్వాత మళ్ళీ మట్టితో కప్పి వేయండి.

ఎలాంటి మట్టి వాడాలి?

స్ట్రాబెరీ లను పెంచడానికి వాడే మట్టి కాస్త ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మట్టి, ఆర్గానిక్ కంపోస్టు, కోకోపీట్ కలిపి ప్రత్యేకంగా మట్టిని తయారు చేయాలి. ఈ కుండీలకు ప్రతిరోజూ గంట పాటూ సూర్యకాంతి తగిలేలా చూసుకోండి. ఎర్రటి ఎండలో మాత్రం పెట్టకండి. కాస్త పాక్షికంగా ఉన్న ఎండలోనే వీటిని ఉంచడం మంచిది.

మీరు విత్తనంతో స్ట్రాబెర్రీ మొక్కను పెంచకుండా నర్సరీ నుంచి చిన్న మొక్కను కొనుగోలు చేసి తెచ్చినట్టయితే... ప్రతిరోజూ నాలుగు గంటల సూర్యకాంతి దానికి అవసరం. మొక్క పెరిగే కొద్దీ సూర్యకాంతి తగిలే సమయాన్ని కూడా పెంచుతూ ఉంచాలి. మొక్కకు ప్రతిరోజూ కొన్ని నీళ్లను చిలకరిస్తూ ఉండండి. రెండు నెలల్లో ఆకులు మొక్క బాగా పెరిగి ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీనికి సరైన ఎరువులను ఎంపిక చేసి వేస్తే మంచిది. ఈ మొక్క ఎదిగిన 90 రోజుల్లో స్ట్రాబెర్రీలు పెరగడం ప్రారంభమవుతాయి.

స్ట్రాబెర్రీలను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అవి కాండం నుండి తిరిగి కిందకి వంగిన తర్వాతే కట్ చేయాలి. ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు కట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. స్ట్రాబెర్రీలు ఆకుపచ్చ నుండి ఎరుపు రంగులోకి మారడానికి కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. కాబట్టి స్ట్రాబెర్రీలు కావాలంటే ఓపికగా వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు వీటిని పెంచితే మీకు మంచి అవగాహన వస్తుంది. రెండోసారి చాలా సులువుగా వీటిని పెంచగలుగుతారు.

Whats_app_banner