Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం... అక్క కాపురంతో చిచ్చు పెడుతున్న‌ అత్త‌ను హ‌త‌మార్చిన త‌మ్ముడు-brother killed mother in law for his sister family disputes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం... అక్క కాపురంతో చిచ్చు పెడుతున్న‌ అత్త‌ను హ‌త‌మార్చిన త‌మ్ముడు

Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోరం... అక్క కాపురంతో చిచ్చు పెడుతున్న‌ అత్త‌ను హ‌త‌మార్చిన త‌మ్ముడు

HT Telugu Desk HT Telugu
Dec 20, 2024 08:43 AM IST

Tirupati Crime: తిరుప‌తి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేస‌కుంది. అక్క కాపురంలో చిచ్చు పెడుతున్న అక్క అత్త‌ను త‌మ్ముడు హ‌త‌మార్చ‌డు. నిందితుడును పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

అక్కను వేధిస్తుందనే కోపంతో అత్తను చంపిన తమ్ముడు
అక్కను వేధిస్తుందనే కోపంతో అత్తను చంపిన తమ్ముడు (photo source from unshplash,com)

Tirupati Crime: తోడబుట్టిన అక్కను వేధిస్తుందనే కోపంతో అత్తను హత్య చేసిన ఘటన తిరుప‌తి న‌గ‌రంలోని సింగాలగుంట‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివ‌రాల ప్ర‌కారం సింగాల‌గుంట‌కు చెందిన జోగారావు, వెంక‌ట‌ల‌క్ష్మి దంప‌తులు ఉన్నారు. వారికి కుమారుడు విజ‌య్ (26), కుమార్తె నాగ‌ల‌క్ష్మి ఉన్నారు.

జోగారావు, వెంక‌ట‌లక్ష్మి కొబ్బ‌రికాయల అమ్ముకుని జీవ‌నం సాగిస్తున్నారు. అదే వీధిలోని నివాసం ఉంటున్న ద్రాక్షాయ‌ణి (50)కి పురుషోత్తమ‌నే కుమారుడు ఉన్నాడు. నాగ‌లక్ష్మి, పురుషోత్తం ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌కు చెప్పి 2013లో వివాహం చేసుకున్నారు.

వివాహం త‌రువాత పురుషోత్తం త‌ల్లికి దూరంగా ఉండేందుకు భ‌వానిన‌గ‌ర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. పురుషోత్తం ఇంటికి స‌మీపంలో ఫోటో ఫ్రేమ్‌లు త‌యారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పురుషోత్తం, నాగ‌ల‌క్ష్మికి ఇద్ద‌రు పిల్లులు ఉన్నారు. అయితే పురుషోత్తం వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని నాగ‌ల‌క్ష్మి పుట్టింటి వారికి ఇస్తున్న‌ట్లు వీరిద్ధ‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వలు జ‌రిగేవి.

ఈ గొడ‌వ‌ల‌కు పురుషోత్తం త‌ల్లి ద్రాక్షాయ‌ణి కారణం అని అంతా భావించారు. ఆమె వ‌ల్ల భార్య భ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వలు జ‌రుగుతున్నాయని నాగ‌ల‌క్ష్మి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బుధ‌వారం రాత్రి కూడా నాగ‌ల‌క్ష్మి, పురుషోత్తం మ‌ధ్య‌ గొడ‌వ చోట చేసుకుంది. దీంతో నాగ‌ల‌క్ష్మి కుటుంబ స‌భ్యులంద‌రూ వ‌చ్చి పురుషోత్తంతో గొడ‌వ‌ప‌డ్డారు.

అంద‌రూ ఒక్క‌సారి వ‌చ్చే అడిగేస‌రికి పురుషోత్తం అలిగి వెళ్లిపోయాడు. వీరు కూడా నాగ‌ల‌క్ష్మిని సింగాల‌గుంట‌లోని పుట్టింటికి తీసుకొచ్చారు. ఈ గొడ‌వ‌ల‌కు అంతా కార‌ణం పురుషోత్తం త‌ల్లి ద్రాక్షాయ‌ణి అని నాగ‌ల‌క్ష్మి త‌మ్ముడు విజ‌య్ భావించాడు. ఆమె చ‌చ్చిపోతే త‌న అక్క కాపురం బాగుంటుంద‌ని, నిరంత‌రం ఆమె కార‌ణంగానే గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాత్రి గొడ‌వ ముగిసిన త‌రువాత ఎలాగైనా అక్క అత్త‌ను హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో ఎవ‌రికి చెప్ప‌కుండా విజ‌య్‌ కొబ్బ‌రికాయ‌లు కొట్టే క‌త్తి తీసుకుని ద్రాక్షాయ‌ణి ఇంటికి వెళ్లాడు. ఆమెపై క‌త్తితో దాడి చేశాడు. ద్రాక్షాయ‌ణికి త‌ల‌కు తీవ్ర‌మైన గాయం అయింది. తీవ్ర ర‌క్త‌స్రావంతో కింద ప‌డిపోయింది. దీంతో చుట్టుప‌క్క‌ల వారు గ‌మ‌నించి, ఆమెను స‌మీపంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డి నుండి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికుల‌ను అడిగి వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం నిందితుడు విజ‌య్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు అలిపిరి సీఐ రామ‌కిషోర్ తెలిపారు. త‌ల్లి మ‌ర‌ణంతో పురుషోత్తం క‌న్నీరుమున్నీరు అయ్యారు.ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner