Accident : కెమికల్స్ ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టిన ట్రక్- ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం!
Jaipur-Ajmer highway accident : కెమికల్స్‌తో వెళ్తున్న ట్యాంకర్ని ఓ ట్రక్ ఢీకొట్టింది. అనంతరం భారీ పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయి. రాజస్థాన్ జైపూర్ అజ్మీర్ హైవేపై ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు.
రాజస్థాన్ జైపూర్‌లోని అజ్మీర్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు వద్ద ఓ ట్రక్, కెమికల్స్ ఉన్న ట్యాంకర్ని ఢీకొనడంతో చెలరేగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో 36 మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
"అజ్మీర్-జైపూర్ హైవేపై ట్రాఫిక్‌లో వెళుతున్న ఓ ట్రక్కు అదుపు తప్పి, అనేక వాహనాలతో పాటు ఓ ట్యాంకర్ని సైతం ఢీకొట్టింది. ఆ ట్యాంకర్లో కెమికల్స్ ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో 36 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారందరినీ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మరింత మందిని వెలికితీసే అవకాశం ఉంది," అని భాంక్రోటా ఎస్హెచ్ఓ మనీష్ గుప్తా తెలిపారు.
పేలుడు ధాటికి ఆ పక్కనే ఉన్న పైపు ఫ్యాక్టరీ, పెట్రోల్ బంకుతో సహా ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయని, మరో 20 సీఎన్జీ కార్లు, ఒక స్లీపర్ బస్సు సహా 40 వాహనాలు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ట్యాంకర్ నుంచి వచ్చిన రసాయనాలు కూడా ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు 30 అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలోని బర్న్ వార్డులో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్టు ఎస్ఎంఎస్ ఎమర్జెన్సీ వార్డు అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు మరో 36 మంది శరీరాలకు మంటలు అంటుకున్నాయని, వీరంతా సగటున 50 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నారని వివరించారు. వీరికి చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
పరిస్థితిని పర్యవేక్షించడానికి రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్ ఖిమ్సర్ కూడా ఉదయం 8:30 గంటలకు ఎస్ఎంఎస్ ఆసుపత్రికి వెళ్లారు.
"అజ్మీర్-జైపూర్ హైవేపై ట్యాంకర్ నుంచి భారీ అగ్నిప్రమాదం సంభవించి పౌరులు మరణించడం బాధాకరమన్నారు. రోగులకు తక్షణ వైద్య సదుపాయాలు కల్పించి చికిత్స అందించాలని ఎస్ఎంఎస్ అధికారులను ఆదేశించాను. ప్రజలను రక్షించడానికి రాష్ట్ర, స్థానిక యంత్రాంగం ఈ ప్రాంతంలో అత్యవసర పద్ధతిలో పనిచేస్తోంది," అని శర్మ చెప్పారు.
ఈ ఘటనపై మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు.
'ఇది ఆందోళనకర పరిస్థితి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత కథనం