ACB Case on KTR : నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదు : కేటీఆర్
ACB Case on KTR : సీఎంకు సమాచారం లోపం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్.. తనపై కేసు నిలవదని ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్‌గా ముందుకు వెళ్తామని.. లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. తనను ఏ కేసులో అరెస్టు చేయాలో సీఎంకు ఆర్థం కావడం లేదన్నారు.
ఏసీబీ కేసు విషయంలో తానేం భయపడడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి జరగలేదన్నారని గుర్తు చేశారు. ప్రొసీజర్ మాత్రమే సరిగా లేదన్నారని.. ఈ విషయంలో సీఎంను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారా? అని అనుమానాం వ్యక్తం చేశారు. తాము కూడా లీగల్‌గానే ముందుకెళతామని తేల్చిచెప్పారు.
'మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. హెచ్ఎండీఏ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. లంచ్ మోషన్ పిటీషన్‌పైన కోర్టు తెలుస్తుంది. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకుపోతే వాళ్ల ఇష్టం. న్యాయపరంగా ఎదుర్కొంటాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
'టీఓటీ దేశంలో ఇప్పటికే అమలులో ఉంది. టీఓటీ విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాం. ఆర్థిక వనరుల సమీకరణపైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ విధానంలోనే.. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులను సేకరించాం' అని కేటీఆర్ వివరించారు.
'ప్రయివేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు అరోపిస్తున్న రేవంత్.. ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు. లక్ష కోట్ల అవినీతి అని గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపైన రేవంత్ రెడ్డి మాట్లాడిన అడ్డగోలు మాటలపైన.. హెచ్ఎండీఏ పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డిపైన హెచ్ఎండీఏ వేసిన కేసు అలాగే ఉంది. ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డుపైన అనేకసార్లు కుంభకోణం అని మాట్లాడారు. మరి కుంభకోణం అంటున్న ఔటర్ రింగ్ రోడ్డు లీజ్‌ను ఎందుకు రద్దు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'తన సొంత శాఖ అధికారులతో దర్యాప్తు చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ చెప్పాలి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వెంటనే రద్దు చేసి.. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలి. ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే.. ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీ కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయడం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అనుకుంటారు. జడ్జి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తాం. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.