ED Focus on KTR : కేటీఆర్‌పై కేసు.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ!
ED Focus on KTR : మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. ఈ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది.
తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాసినట్టు సమాచారం. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఈడీ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి.. ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరినట్టు తెలిసింది. దాన కిశోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.
సరైన అనుమతులు లేకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిధుల నుండి.. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు రూ.55 కోట్లు బదిలీ చేశారు. దీని చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో.. అవినీతి నిరోధక శాఖ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా చేర్చింది.
అంతకుముందు.. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 12, 2024న అటార్నీ జనరల్‌తో సంప్రదించిన తర్వాత.. కేటీఆర్, అరవింద్ కుమార్‌లపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం ఈ ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించాలని.. ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. లీగల్‌గానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
'మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. హెచ్ఎండీఏ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైన డబ్బులు ఖర్చు చేయవచ్చని ఉంది. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు. దానికి ఆ మేరకు స్వతంత్రత ఉంది. లంచ్ మోషన్ పిటీషన్‌పైన కోర్టు తెలుస్తుంది. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు. అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకుపోతే వాళ్ల ఇష్టం. న్యాయపరంగా ఎదుర్కొంటాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. దీనిపై కేటీఆర్ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.