Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం - విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు-telangana cs write letter to acb to probe formula e race scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం - విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు

Formula E Race Scam Case : ఫార్ములా ఈరేసు వ్యవహారం - విచారణ కోసం ఏసీబీకి సీఎస్ లేఖ, 10 ముఖ్యమైన అంశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 18, 2024 06:39 AM IST

Formula E Car Race Case Scam : ఫార్ములా ఈ-రేస్ విచారణ కొరకు తెలంగాణ సీఎస్… ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం పై విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జత చేశారు. దీంతో ఈ కేసులో విచారణ షురూ కానుంది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించే అవకాశం ఉంది.

ఫార్ములా ఈరేస్ కేసు
ఫార్ములా ఈరేస్ కేసు

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కేసులో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు ఇటీవలనే గవర్నర్ అనుమతి ఇవ్వటంతో…విచారణ ప్రక్రియ షురూ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా…. ఈరేసు వ్యవహారంపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇందుకు జత చేశారు.

సీఎస్ లేఖ రాయటంతో ఏసీబీ విచారణ షురూ చేయనుంది. ప్రాథమికం ఆధారాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి… పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈరేస్ కేసులో రూ. 50 కోట్లకుపైగా నిధులు దారి మళ్లియాని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అధికార దుర్వినియోగం జరిగిందని… ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఇందుకు కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో… ఫార్ములా ఈరేసు కేసు ఏసీబీకి చేతుల్లోకి వెళ్లనుంది.

నిజానికి ఈ వ్యవహారంలో జరిగిన చెల్లింపులపై ఇప్పటికే పురపాలక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. హెచ్‌ఎండీఏ ఒప్పందం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి అంశాలను ఏసీబీ దృష్టికి తీసుకెళ్లింది. పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తో పాటు మరికొందరు అధికారుల పేర్లను కూడా ప్రస్తావించింది. ఇక అప్పడు మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీంతో ఆయన పేరును కూడా పేర్కొంది. అధికారులపై విచారణకు అనుమతి ఉన్నప్పటికీ… కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతిని కోరింది. ఇందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ రావటంతో…. సీఎస్ ఏసీబీకి లేఖ రాశారు.

ఫార్ములా ఈరేసింగ్ వ్యవహారం - 10 ముఖ్యమైన అంశాలు:

  1. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
  2. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూాడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
  3. రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది.
  4. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీసంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది.
  5. ఇప్పటికే ఈ కేసులోని అధికారుల పాత్రపై దర్యాప్తునకు అనుమతి రాగా… అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విచారణ జరపాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోరగా.. ఇటీవలే అనుమతి వచ్చింది.
  6. గవర్నర్ నుంచి అనుమతి రావటంతో ఈరేసు వ్యవహారంపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇందుకు జత చేశారు.
  7. ఈ కేసు వ్యవహారంపై కేటీఆర్ పలుమార్లు స్పందించారు. ఈ-రేస్‌కు కోసం ప్రభుత్వం తరపున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే అని… కానీ హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని క్లారిటీ ఇచ్చారు. ఈ-రేస్‌ను ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇందులో అరవింద్ కుమార్ తప్పు ఏం లేదని… నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు.
  8. విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఏసీబీ విచారణలో పూర్తిస్థాయిలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
  9. ఈ కేసులో ప్రాథమిక విచారణలో లభించే ఆధారాల తర్వాత ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు అప్పటి అధికారులను విచారించే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం