YS Sharmila Complaint : సెకీతో జగన్ డీల్ - ఏసీబీకి వైఎస్ షర్మిల ఫిర్యాదు
అదానీ - వైఎస్ జగన్ సోలార్ ఒప్పందాలపై వైఎస్ షర్మిల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెట్టాయని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదానీ - జగన్ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించిందని విమర్శించారు. బోను నుంచి ఏసీబీని విడుదల చేసి స్వేచ్ఛగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అదానీపై అమెరికాలో దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. సోలార్ పవర్ డీల్ లో జగన్ కి రూ.1750 కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించిందని గుర్తు చేశారు. ఆధారాలు కూడా బయటపెట్టిందన్నారు.
ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ? 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్ పై హైకోర్టు లో పిటీషన్ కూడా వేసింది. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ఆ రోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? జగన్ కి నష్టం లేదు..మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే. ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్ కి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది. రేపు 50 పైసలకే వచ్చినా తగ్గొచ్చు. సోలార్ పవర్ రేట్లు తగ్గుతుంటే... మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు..? రూ.2.49 పైసలకు కొని రాష్ట్ర ప్రజలు నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారు" అని వైఎస్ షర్మిల నిలదీశారు.
అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. “అదానీ బీజేపీ మనిషి.. మోడీ మనిషి. బీజేపీతో మీకు అలయెన్స్ ఉంది. అందుకే మీరు అదానీకి, మోడీకి భయపడుతున్నారు. అదానీని కాపాడుతున్నారు.కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నారు. JPC వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా మోదీ నోరు విప్పడం లేదు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు. ఈ అవినీతి బయటపెట్టని CBI చేతకానిదా? మోడీ చేతకాని వారా..?” అంటూ షర్మిల కామెంట్స్ చేశారు.
“చంద్రబాబు గారు.. మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. ప్రజలు మిమల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి” అని షర్మిల హితవు పలికారు.