TG Weather : తెలంగాణపై చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు-telangana weather report next two days cold winds likely says hyderabad met department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Weather : తెలంగాణపై చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు

TG Weather : తెలంగాణపై చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు

Bandaru Satyaprasad HT Telugu
Dec 17, 2024 06:32 PM IST

TG Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు
తెలంగాణలో చలి పంజా, మరో రెండ్రోజుల పాటు శీతలగాలులు

TG Weather : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో...ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఈశాన్య దిశలో చలిగాలులు గంటకు 2-6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఇవాళ గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 11.9 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ 65 శాతంగా పేర్కొన్నారు.

తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్ లో కనిష్ఠంగా 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయిందని వాతావరణ కేంద్రం తెలిపింది. పటాన్ చెరులో 7 డిగ్రీలు, మెదక్ లో 7.5, రాజేంద్ర నగర్ లో 8.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. అల్పపీడనం రానున్న రెండు రోజులలో బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం