KCR Landmarks : కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోతాయా..! కాంగ్రెస్ కష్టాలు కొని తెచ్చుకుంటోందా?
KCR Landmarks : రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుకు ఏడాది నిండింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో చాలా వరకు సంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ.. కొందరు చేసే పొలిటికల్ కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఆనవాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్.. తెలంగాణ మళిదశ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నేత. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఎంతో కీలకం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన కృషి ఎన్నో మంచి ఫలితాలను ఇచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. కేసీఆర్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, ఇతర కారణాల వల్ల ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారు. కానీ ఇప్పటికీ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే భావన చాలామందిలో ఉంది.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఐదేళ్లు పాలించమని, ఇచ్చిన హామీలు నేరవేర్చమని ఎన్నికల్లో గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అటు హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై చాలావరకు ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని హామీలు అమలు ఆలస్యం అయినా.. మున్ముందు చేస్తారులే అనే భావన ప్రజల్లో ఉంది.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఈమధ్యనే మొదలైంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారిపోయాయి. దీన్ని బీఆర్ఎస్ గట్టిగా వ్యతిరేకించింది. అంతే స్థాయిలో కాంగ్రెస్ తిప్పికొట్టింది. కానీ.. కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకేసి ఓ కీలకమైన కామెంట్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని.. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే నేతలు వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కష్టాలను తీసుకొస్తున్నాయని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ లీడర్లు ఇష్యూపై మాట్లాడి.. విమర్శలు చేస్తే బాగుండేదని.. అనవసరంగా కేసీఆర్ ఆనవాళ్ల అంశాన్ని నెత్తిన వేసుకున్నారని.. అదే పార్టీకి చెందిన నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదే అయ్యింది. ఈ ఏడాదిలో మహిళలకు ఫ్రీ బస్సు మినహా.. కాంగ్రెస్ పేరు చెబితే ఇంకేం గుర్తుకురావు అనే అభిప్రాయాలు ఉన్నాయి.
కానీ.. కేసీఆర్ పేరు చెబితే.. ఇప్పుడున్న సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధి, జిల్లాల్లో కలెక్టరేట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంట్.. ఇలా ఎన్నో పథకాలు గుర్తోస్తాయి. అన్నింటికి మించి.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడనే పేరుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'కేసీఆర్ హయాంలో ఉన్న పథకాల్లో అక్రమాలు జరిగాయా లేదా అనే విషయంపై విమర్శలు చేస్తే బాగుండేది. కానీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాట్లాడటం సరికాదు. గతంలో కేసీఆర్ ఇలానే హేళనగా మాట్లాడి, ఇతర పార్టీల నాయకులను చులకనగా మాట్లాడి నష్టపోయారు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వాళ్లు అదే చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు లాంటి వారిని విమర్శించినా పెద్దగా నష్టం ఉండదు. కానీ.. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని విమర్శలు, ఆరోపణలు చేస్తే బాగుంటుంది' కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
'కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయినా.. తెలంగాణలో ఆయనకున్న గుర్తింపు, పేరు తగ్గదు. పక్క రాష్ట్రాల్లో కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజాగ్రహానికి గురయ్యారు. అలాంటి ఉదాహరణలు మన కళ్ల ముందే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్‌పై మాట్లాడేటప్పుడు కాస్త ఓపికతో మాట్లాడాలి. నేరుగా కేసీఆర్ ఏదైనా కామెంట్ చేస్తే.. దానికి సమాధానం చెప్పడం, కౌంటర్ ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది. కానీ.. ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బదులుగా.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం' ఆ సీనియర్ నేత చెప్పారు.