Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’కి సీనియర్ హీరో మాట సాయం.. స్పెషల్ అట్రాక్షన్‌‌ కోసం బాబీ ప్లాన్-ravi teja lends voice for nandamuri balakrishna movie daaku maharaaj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’కి సీనియర్ హీరో మాట సాయం.. స్పెషల్ అట్రాక్షన్‌‌ కోసం బాబీ ప్లాన్

Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’కి సీనియర్ హీరో మాట సాయం.. స్పెషల్ అట్రాక్షన్‌‌ కోసం బాబీ ప్లాన్

Galeti Rajendra HT Telugu

Daaku Maharaaj: డాకు మహారాజ్ మూవీలో పాత్రల పరిచయం కోసం వాయిస్ ఓవర్ అవసరం అవుతోందట. దాంతో దర్శకుడు బాబీ.. ఓ సీనియర్ హీరోని అడగడం.. వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట.

డైరెక్టర్ బాబీ, నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. వరల్డ్‌వైడ్ జనవరి 12, 2025న రిలీజ్‌కానున్న ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరో‌‌ని దర్శకుడు బాబీ ఓ సాయం కోరినట్లు తెలుస్తోంది.

సాయం కోరిన డైరెక్టర్ బాబీ

డాకు మహారాజ్‌కి కథలో భాగంగా పాత్రలు పరిచయం, కొన్ని సన్నివేశాలకి ముందు ఒక వాయిస్ ఓవర్ అవసరమవుతోందట. దాంతో ఆ వాయిస్ ఓవర్‌ ఇవ్వాల్సిందిగా మాస్ మహారాజా రవితేజని కోరగా.. అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాబి- రవిజేతకి మధ్య సుదీర్ఘకాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో.. బాబీ అడగ్గానే ఒప్పుకున్నట్లు సమాచారం.

సైకిల్‌కి కూడా వాయిస్ 

రవితేజ గతంలో కొన్ని సినిమాలకి ఇలానే వాయిస్ ఓవర్ ఇచ్చారు. మర్యాద రామన్న సినిమాలో సైకిల్‌కి కూడా రవితేజ వాయిస్ ఇచ్చి ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన డాకు మహారాజ్ టైటిల్ టీజర్‌ సినిమాపై అంచనాల్ని పెంచేయగా.. బాలయ్య లుక్ కూడా అట్రాక్టీవ్‌గా ఉంది. దాంతో సంక్రాంతి రేసులో రెండు పెద్ద సినిమాలు ఉన్నా.. సాహసోపేతంగా బాలయ్య ‘డాకు మహారాజ్’ బరిలోకి దిగుతోంది. ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అంటూ ఇప్పటికే దర్శకుడు బాబీ అంచనాల్ని పెంచేసిన విషయం తెలిసిందే.

డాకు మహారాజ్ కథ ఏంటంటే?

ఓ దోపిడీ ముఠాకి చెందిన డాకు సింగ్‌ బయోగ్రఫీనే ఈ ‘డాకు మహారాజ్’ అని తెలుస్తోంది. 1980లో ఛంబల్ ఏరియాలో ఓ దోపిడీ ముఠాని ఏర్పాటు చేసుకున్న డాకు సింగ్.. లెక్కలేనన్ని దోపిడీలు, దురాగతాల్ని చేశాడు. 16 ఏళ్ల పాటు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన డాకు సింగ్.. ఆఖరికి అతని కొడుకు చేతిలోనే చనిపోయాడు. ఇప్పటికే డాకు సింగ్‌‌పై ‘డాకు మాన్ సింగ్’ అనే ఒక సినిమా కూడా వచ్చింది.

ఆగమేఘాల మీద షూటింగ్

దోపిడీలు, హత్యలు, దౌర్జన్యాలు చేసిన డాకు సింగ్.. వేలాది మంది పేదలకి అప్పట్లో సాయం చేశాడట. వందలాది గ్రామాలు అతని ద్వారా లబ్ధి పొందాయట. దాంతో ఈ కథ వినగానే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. నెలల వ్యవధిలోనే షూటింగ్ ముగించుకుని ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది.