Zero Safety Electric Car : ఈ ఎలక్ట్రిక్ కారు జీరో సేఫ్టీ.. కచ్చితంగా ఈ వివరాలు తెలుసుకోవాలి!
Zero Safety Electric Car : కారు తీసుకుంటే సేఫ్టీ గురించి కచ్చితంగా ఆలోచించాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు జీరో స్టార్ రేటింగ్ ఉంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..
గ్లోబల్ ఎన్సీఏపీ కార్ క్రాష్ టెస్ట్‌లో సిట్రోయెన్ ఈసీ3 ఘోరంగా విఫలమైంది. దీనికి 0 స్టార్ రేటింగ్ ఉంది. భద్రత పరంగా, ఈ ఎలక్ట్రిక్ కారు అస్సలు సురక్షితం కాదని అంటున్నారు. అందువల్ల భద్రత దృష్ట్యా మీరు దానిని తీసుకునే ముందు సేఫ్టీని చెక్ చేయాలి.
జూలై 2022 నుండి గ్లోబల్ ఎన్సీఏపీ అమలు చేసిన కొత్త క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ కింద ఇప్పటివరకు అనేక కార్లను పరీక్షించారు. ఈ కొత్త మార్గదర్శకాలు కార్ల సేఫ్టీని మరింత కఠినమైన ప్రమాణాలకు పరీక్షిస్తాయి. 10 సంవత్సరాల క్రితం సేఫర్ కార్స్ ఫర్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ కార్లు, ఎస్‌యూవీలు 5-స్టార్ రేటింగ్‌లను పొందుతున్నాయి. అయితే క్రాష్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైన సిట్రోయెన్ ఈసీ3 వంటి కొన్ని కార్లు కూడా ఉన్నాయి. దీనికి క్రాష్ పరీక్షల్లో గ్లోబల్ ఎన్సీఏపీ 0-స్టార్ రేటింగ్ ఇచ్చింది.
గ్లోబల్ ఎన్సీఏపీ కొత్త నిబంధనల ప్రకారం పరీక్షించిన ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3. కానీ ఇది అతి తక్కువ రేటింగ్‌ను కలిగి ఉంది. క్రాష్ టెస్ట్‌లో సిట్రోయెన్ ఈసీ3.. 0 స్టార్ రేటింగ్ ను పొందింది.
ఈ ఎలక్ట్రిక్ కారు వయోజన భద్రతలో 20.86/34 పాయింట్లు సాధించి ఉండవచ్చు. కానీ దాని ఈఎస్సీ(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), సీట్ బెల్ట్ రిమైండర్ లేకపోవడం ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఇది దాని రేటింగ్‌ను ప్రభావితం చేసింది. దీనికితోడు పాదచారుల భద్రతా ప్రమాణాలను కూడా కారు అందుకోలేదు. డ్రైవర్, ప్రయాణికుడి ఛాతీ, కాళ్ల రక్షణ కూడా సరిపోదని భావించారు.
చైల్డ్ సేఫ్టీ (కాప్) ర్యాంకింగ్స్‌లో సిట్రోయెన్ ఈసీ3 49కి 10.55 స్కోర్ సాధించి 1-స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో ఐసోఫిక్స్ మౌంట్లు లేవని, ఇది పిల్లల సీటును రక్షించదని పరీక్షలో తేలింది. ముందు భాగంలో మూడేళ్ల డమ్మీ తల కారు లోపలి భాగాన్ని తాకగా, సైడ్ ఇంపాక్ట్‌లో 18 నెలల డమ్మీ తల పూర్తిగా బహిర్గతమైంది. ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, విప్లాష్, పెడిస్ట్రిషన్ ప్రొటెక్షన్, ఈఎస్సీ విభాగాల్లో పరీక్షించారు. టెస్టింగ్ కోసం ఉపయోగించే మోడల్లో ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్‌గా కూడా ముందు, వెనుక వరుసల్లో సైడ్ హెడ్ ప్రొటెక్షన్‌ను అందించలేదు. ఈ కారణంగా క్రాష్ టెస్ట్ సమయంలో భారీ పాయింట్లు కోల్పోయింది.
కొత్త భద్రతా మార్గదర్శకాల ప్రకారం భారతీయ కార్లు మెరుగుపడినప్పటికీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి ఉదాహరణలు సేఫ్టీలో తక్కువగా ఉన్నాయి. కారును ఎంచుకునేటప్పుడు వినియోగదారులు సేఫ్టీ రేటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
భారత్ ఎన్సీఏపీ తన స్వంత సేఫ్టీ కార్యక్రమాన్ని చేస్తుంది. భారత మార్కెట్లో ఇది ఒక పెద్ద ముందడుగు. రాబోయే కాలంలో మరింత సురక్షితమైన కార్లకు మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఉపయోగపడుతుంది. ఏదేమైనా కొన్ని కార్ల తయారీదారులు ఇప్పటికీ సేఫ్టీ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.