Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు 'పొంగల్' ఉపాధి - భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్...!-sircilla weavers get order from tamil nadu govt for pongal sarees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు 'పొంగల్' ఉపాధి - భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్...!

Sircilla Weavers : సిరిసిల్ల నేతన్నలకు 'పొంగల్' ఉపాధి - భారీగా చీరల ఆర్డర్ ఇచ్చిన తమిళనాడు సర్కార్...!

HT Telugu Desk HT Telugu
Dec 18, 2024 06:16 AM IST

వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి దొరికింది. సాంచల్ బంద్ అయి ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నేతన్నకు తమిళనాడు బాసటగా నిలిచింది. పొంగల్ చీరల ఆర్డర్ ఇచ్చి నేతన్నకు చేతినిండా పని కల్పించింది.‌ వస్త్ర పరిశ్రమ నిలయమైన సిరిసిల్ల సాంచల చప్పుడుతో సందడిగా మారింది.

సిరిసిల్ల నేతన్నకు 'పొంగల్' ఉపాధి
సిరిసిల్ల నేతన్నకు 'పొంగల్' ఉపాధి

ఏడాది కాలం ఉపాది లేమితో సిరిసిల్ల నేత కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. వారికి కాస్త ఊరటనిచ్చేలా తమిళనాడు ప్రభుత్వం భారీ ఆర్డర్ ఇచ్చింది. వచ్చే నెల జనవరి లో జరిగే పొంగల్ పండుగను తమిళ ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. అక్కడి ప్రభుత్వం మహిళలకు పొంగల్ కానుకగా చీరలను అందజేయనుంది. అందుకు కావాల్సిన చీరల ఆర్డర్ ను తమిళ ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. దీంతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. తమిళనాడు చీరల ఆర్డర్ తో సిరిసిల్ల నేతన్నల ఇంటా ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది.

yearly horoscope entry point

నేతన్నల్లో ఆనందం...

తమిళనాడు ప్రభుత్వం ప్రతి సంవత్సరం సంక్రాంతి (పొంగల్) పండుగకు పేదలకు చీరలను పంపిణీ చేస్తుంది. ఈసారి 3.12 కోట్ల చీరలు, పంచెల ఉత్పత్తికి రూ.485.25 కోట్లు కేటాయించింది. అందులో1.56 కోట్ల చీరలు ఉన్నాయి. ఇవి తమిళనాడు లోని తిరుపూర్, కోయంబత్తూర్, సేలం, ఈరోడ్ ప్రాంతాల్లోని మరమగ్గాలకు ఆర్డర్లు ఇవ్వగా.. సమయం తక్కువగా ఉండడంతో పండుగకు సకాలంలో చీరలు కావాలని టెండర్ల ద్వారా సిరిసిల్ల కు ఆర్డర్లు ఇచ్చారు.

11 లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి అర్డర్లు (సుమారు 2 లక్షల చీరలు) రావడంతో నేత కార్మికులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు చీరలు ఉత్పత్తి చేయడం ద్వారా నెల రోజులపాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కోటి 30 లక్షల చీరెలు ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని పాలిస్టర్ బట్ట తయారు చేస్తే కనీస గిట్టు బాటు కావడం లేదని ప్రభుత్వమే కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.

గ్రామాల్లో చీరల సందడి...

తమిళనాడు ప్రభుత్వానికి అవసరమైన చీరల ఉత్పత్తితో సిరిసిల్లతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో చీరల సందడి నెలకొంది. సిరిసిల్లతోపాటు చంద్రంపేట, తంగళ్ళపల్లి, రాజీవ్ నగర్, గంగాధర మండలం గర్షకుర్తి ప్రాంతాల్లో తమిళనాడు చీరల ఉత్పత్తి చేస్తూ నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. ఒక్క మీటరు బట్ట నేసి ఇస్తే రూ.6 ఇస్తున్నారు. అదే లేబర్ కు ప్రతీ మీటరుకు రూ.2.50 చెలిస్తారు. సాంచాలపై ఉత్పత్తి చేసిన బట్ట ఆధారంగా ఆసామికి, కార్మికుడికి కూలి లభిస్తుంది.

విభిన్న రకాలు...

సిరిసిల్లలో గతంలో తెల్లని పాలిస్టర్ బట్టను మాత్రమే ఉత్పత్తి చేసే నేత కార్మికులు పవర్ లూమ్స్ పై టెక్నాలజీ జోడించి వివిధ డిజైన్ లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు. మగ్గాలకు జకార్డ్, దాబీలను అమర్చుకొని కొంగు, చీరల బార్డర్, అంచుల్లో రకరకాల పలు రంగులను కలిపి అందమైన చీరలు నేశారు. దీంతో ఇప్పుడు సిరిసిల్ల వస్త్రానికి నవ్యత, నాణ్యత అదనుపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. త్వరలో మహిళా సంఘాల కు చీరలు పంపిణీ చేస్తామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలోనే ఆ చీరలను నేయించే సన్నాహాలు జరుగుతున్నాయి.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner