Mla Video Call : అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్, ప్రత్యర్థుల పనా? సైబర్ కేటుగాళ్ల వలా?-karimnagar nude video call from woman to congress mla cybercrime police case filed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Video Call : అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్, ప్రత్యర్థుల పనా? సైబర్ కేటుగాళ్ల వలా?

Mla Video Call : అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్, ప్రత్యర్థుల పనా? సైబర్ కేటుగాళ్ల వలా?

HT Telugu Desk HT Telugu
Oct 19, 2024 10:21 PM IST

Mla Video Call : అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి...ఓ మాయలేడి నుంచి న్యూడ్ వీడియో కాల్ చేయడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
అధికార పార్టీ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు శుక్రవారం అర్ధరాత్రి వీడియో కాల్... కాల్ లిఫ్ట్ చేయగానే నగ్నంగా మాయలేడి వీడియో... అవాక్కైన ఎమ్మెల్యే కాల్ కట్ చేసి ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి వీడియో కాల్ ఏంటి? మాయ లేడి నగ్నంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలియక సతమతమయ్యాడు.‌ తన వెంట ఉండే సెక్యూరిటీకి సమాచారం ఇచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. నేష‌న‌ల్ సైబ‌ర్‌ క్రైమ్ పోర్టల్‌ లో ఫిర్యాదు చేయగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అర్ధరాత్రి అధికార పార్టీ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరా ఎమ్మెల్యే అని కొందరు ఆరా తీస్తుంటే, మరికొందరు కాల్ చేసింది ఎవరు? ఎందుకోసం చేశారని వెతుకుతున్నారు. గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చిన న్యూడ్ వీడియో కాల్ పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎమ్మెల్యే అయిన, ఆయన అందరితో కలుపుగోలుగా ఉంటూ సౌమ్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేను టార్గెట్ ఎవరు చేశారు? ఎందుకోసం చేశారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల పనా?.. లేక సైబర్ నేరగాళ్ళా? అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యేకు అర్ధరాత్రి దాటాక న్యూడ్ వీడియో కాల్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారి అందరి మెదళ్లను తొలుస్తుంది. కావాలని ఎమ్మెల్యేను ఇరికించాలనే ఉద్దేశంతో న్యూడ్ వీడియో కాల్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారం పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారా?

సైబర్ నేరగాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారా? అంటే ఇటీవల జరిగిన వరుస సంఘటన చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన అంగతకుడు అతని ఫ్యామిలీ మొత్తాన్ని హతం చేస్తానని హెచ్చిరించినట్టు సమాచారం. ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. అత్యంత రహస్యంగా పోలీసులు ఎమ్మెల్యేకు కాల్ చేసి హెచ్చరించిన కేసును దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.

తాజాగా న్యూడ్ వీడియో కాల్

తాజాగా ఉమ్మడి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్ రావడం కలకలం సృష్టిస్తుంది. 14న అర్ధరాత్రి దాటాక వచ్చిన కాల్ తో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన సలహా మేరకు హైదరాబాద్ లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు 67A ITA 2000-2008 సెక్షన్ పై కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ క్రైమ్ బ్యూరో పోలీసులు సైబర్ క్రైమ్ క్రింద విచారణ చేపట్టారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు చేశారని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.

వరుస ఘటనలు అందులో అధికారపార్టీకి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేకు కాల్స్ రావడంతో సైబర్ నేరగాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారా? లేక బద్నాం చేయాలని స్థానికులే అలా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ సాగుతుంది. క్రిమినల్స్ వ్యవహరిస్తున్న తీరు దేనికి సంకేతం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.‌ వెలుగులోకి వచ్చిన వరుస ఘటనలతో అటు ఎమ్మెల్యేలు ఇటు పోలీసులు అలర్ట్ గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner