TG Group 1 Row : తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్తత.. గ్రూప్-1 అభ్యర్థుల అరెస్ట్
TG Group 1 Row : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో హైదరాబాద్ నగరం అట్టుడుకుతోంది. శనివారం గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన ఉధృతం చేశారు. వీరికి కేంద్రమంత్రి బండి సంజయ్, కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. సచివాలయం దగ్గర గ్రూప్ 1 అభ్యర్థులను అరెస్టు చేశారు.
తెలంగాణ సచివాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం ఎదుట గ్రూప్-1 అభ్యర్థులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద రోడ్డుపై కూర్చొని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. గ్రూప్-1 అభ్యర్థులను అరెస్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టుపై గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'గ్రూప్-1 అభ్యర్థులను చర్చలకు పిలవకపోవడం దారుణం. అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు. బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్ ర్యాలీ చేయించారు. బండి సంజయ్‌ని చర్చలకు పిలిచినా లాభం ఉండదు. బండి సంజయ్ ఏం చదువుకున్నారు.. ప్రశ్నాపత్రాలు లీక్ చేయడమే బండి సంజయ్‌కి తెలుసు. బండి సంజయ్‌కు పరీక్షల గురించి ఏం తెలుసు' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'సీఎం రేవంత్‌కు నేను సవాల్ చేస్తున్నా.. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి. ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేమని తుమ్మల చెప్పారు. మాట తప్పినందుకు రేవంత్ ముక్కు నేలకు రాయాలి. రుణమాఫీ, బోనస్ విషయంలో రేవంత్ మోసం చేశారు. ఇప్పుడు రైతుబంధు విషయంలో కూడా మోసం చేశావు. కాంగ్రెస్ సర్కార్‌ని ఎక్కడికక్కడ నిలదీయాలి' అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
'గ్రూప్1 అభ్యర్థుల పక్షాన మేము సుప్రీంకోర్టుకు పోయాం. గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్‌ని కలిసి వారి సమస్యలు చెప్పగానే.. వారి కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం.. నిన్నంతా మేము సుప్రీంకోర్టులోనే ఉన్నాం. జీవో 29 రద్దు చేయకుండా పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం మొండిగా చూస్తుంది. అర్జెంటుగా జీవో 29ని రద్దు చేసి.. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ను పునరుద్ధరించాలి. అప్పుడే పరీక్షలు పెట్టాలి' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. వీరికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ రాకతో.. అశోక్ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.