Jagtial Crime News : డమ్మీ తుపాకులతో బెదిరించి చోరీ - ఆరుగురు కేటుగాళ్లు అరెస్ట్
జగిత్యాల జిల్లా బీర్ పూర్ లో గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడ్డ కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు సభ్యులతో కూడిన ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 2 డమ్మీ తుపాకులు, పది వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 14న తెల్లవారుజామున 5 గంటలకు బీర్ పూర్ లో గన్నులతో బెదిరించి ఈశ్వరయ్య పై దాడి చేసి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం కావడంతో గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడడం పోలీసులకు సవాలుగా మారింది. చోరీ చేసింది దొంగలా.. లేకుంటే మావోయిస్టులా అనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టగా స్థానికుడితో పాటు మరో ఆరుగురు చోరీకి పాల్పడ్డట్లు తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈజీ మనీ కోసం చోరీకి పాల్పడ్డ ఏడుగురు సభ్యులు గల ముఠాలో ఆరుగురి అరెస్టు చేసి ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో పట్టుబడ్డ వారిని స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు.
గుప్త నిధుల వేట...చోరీకి దారితీసిన వైనం..
జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు చెందిన మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్, యశోద శ్రీనివాస్, సైదు సహదేవ్, రత్నం మాణిక్యం, ముకునూరి కిరణ్ కుమార్ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రంతో గుప్తా నిదుల కోసం వెతుకుతూ ఉండేవారు. ఎక్కడ కూడా గుప్తా నిధులు దొరకకపోవడంతో బాగా డబ్బులు ఉన్న వారి ఇంట్లో దోపిడి చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేద్దామనుకుని ప్లాన్ వేశారు.
ఒకరోజు తుమ్మెనాల దగ్గర గల సహదేవ్ హోటల్లో కలిసి బీర్పూర్ లో డబ్బులు, బంగారం ఉన్న సేటు కాసం ఈశ్వరయ్య ఇంట్లో బార్యభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారని తెలుసుకున్నారు. వారు ముసలి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడి చేస్తే డబ్బు, బంగారు ఆభరణాలు దొరుకుతాయని భావించారు. అనుకున్నదే తడవుగా 13న రాత్రి అందరు కలిసి తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకున్నారు. మంకీ క్యాప్ లు ధరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ లు బైక్ లపై బీర్పూర్ కి వెళ్ళారు. అర్ధరాత్రి 2.30 గం. లకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ దగ్గర దాక్కొని ఉన్నారు.
ఉదయం 5.00 గం.లకు ఈశ్వరయ్య బాత్రూమ్ కి వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అధిమి పట్టి బొమ్మ తుపాకితో తల మీద కొట్టి చంపుతామని బెదిరించారు. ఇంట్లోకి ఈడుచుకెళ్లి ఈశ్వరయ్య, అతని భార్యను కొట్టి గుడ్డ పేగులు నోట్లో కుక్కి కట్టేశారు. వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆబరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడి చేసుకొని అక్కడి నుండి ఫారెస్ట్ మార్గం ద్వారా తుమ్మెనలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సహదేవ్, రత్నం మాణిక్యం లు ఉన్నారు. అందరూ కలిసి జల్సా చేశారు.
ప్రత్యేక టీమ్ లతో నిఘా - పట్టుబడ్డిన ముఠా...
గన్నులతో బెదిరించి దాడి చేసి చోరీ కి పాల్పడడాన్ని సవాల్ గా తీసుకున్నారు పోలీసులు. మూడు ప్రత్యేక పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసి నిఘా పెట్టగా ముఠా పట్టుబడిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొందరు నిందితులు దర్మపురి మండలంలోని తుమ్మెనల గుట్ట దగ్గర ఉన్నారని విశ్వసనీయమైన సమాచారం అందిందని చెప్పారు. ఈమే మేరకు తనిఖీలు చేపట్టగా ఆరుగురు పట్టుబడ్డారని వివరించారు.
జల్సా కోసం ఈజీగా మణీ సంపాదించడానికే డమ్మీ ఆయుధాలతో చోరీకి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు. చోరీ కేసును చేదించి ఆరుగురిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ ఎస్పీ రివార్డు ప్రకటించారు. పరారీ లో ఉన్న ముకునూరి కిరణ్ కుమార్ ను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.