Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మార్చి నెల దర్శన టికెట్ల విడుదల తేదీల్లో మార్పులు
Tirumala Tirupati Devasthanam Updates : మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. 26వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.
తేదీలు మార్పు…
డిసెంబర్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి, తిరుమలలోని వసతి గదులు కోటా టికెట్లను విడుదల చేయనుంది.
ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 24న విడుదల కావాల్సి ఉంది. ఇక డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని పేర్కొంది. కానీ తాజా ప్రకటనలో పలు మార్పులు చేసింది.
మార్పులకు అనుగుణంగా భక్తులు టికెట్లను బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఇతర సైట్లను నమ్మవద్దని కోరింది.
- డిసెంబరు 21న ఆర్జిత సేవా టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
- డిసెంబరు 21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- డిసెంబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు: మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
- వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సంబంధిత కథనం