Infant Weight Growth: పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బరువు పెంచే మార్గాలేంటి?
Infant Weight Growth: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 మిలియన్లకు పైగా పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. శిశువు తగిన బరువు లేకపోవడం వ్లల ఆరోగ్యం, శారీరక అభివృద్ధి రెండింటినీ ప్రభావితం చేస్తుంది. బరువు పెరిగేలా బిడ్డను ఎలా చూసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డ పుట్టుక కోసం ఎదురు చూస్తుంటారు. కుమారుడు లేదా కుమార్తె పూర్తిగా ఆరోగ్యంగా జన్నించాలని ప్రార్థిస్తారు. కానీ కొన్నిసార్లు ఈ ప్రార్థన నెరవేరదు. ఈ మధ్య కాలంలో నవజాత శిశువుల్లో అత్యంత సాధారణ సమస్యలు, సవాళ్లలో ఒకటి శిశువు పుట్టినప్పుడు తక్కువ బరువు కలిగి ఉండటం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పుట్టినప్పుడు 2.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న శిశువులను తక్కువ జనన బరువు గల పిల్లలు (ఎల్బిడబ్ల్యు) గా పరిగణిస్తారు. మన దేశంలో నవజాత శిశువుల్లో 20 శాతం మంది తక్కువ బరువుతోనే పుడుతున్నారు.
శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కారణాలు..
శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కేవలం నెలలు నిండక ముందే పుట్టడం మాత్రమే కారణం కాకపోవచ్చు. తల్లి గర్భంలో 40 వారాలు గడిపే పిల్లలు కూడా తక్కువ బరువుతో పుడుతున్నారు. గర్భిణి సరైన పోషకాలను, విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కాలొరీలు తీసుకోకపోతే శిశువు తక్కువ బరువుతో పుట్టవచ్చు. గర్భిణికి రక్తపోటు (హైపర్‌టెన్షన్), షుగర్ (డయాబెటిస్), గర్భాశయ సంబంధి సంక్లిష్టతలు లేదా కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు ఉంటే, శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు ఉంటాయి. తల్లి ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు గురైనప్పుడు కూడా శిశువు శరీర అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు. తద్వారా బిడ్డ తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంటుంది. ఇలా కారణాలేవైనప్పటికీ బరువు తక్కువగా ఉండే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పిల్లల ఎదుగుదల, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారు అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
బరువు తక్కువగా ఉండే శిశువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎన్ఐసియు కేర్ తప్పనిసరి:
సాధారణంగా 1.5 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న నవజాత శిశువులను బరువు కొద్దిగా పెరిగే వరకు ఎన్ఐసియు (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో ఉంచాలి. ఎందుకంటే అటువంటి తక్కువ బరువు శిశువుకు ప్రాణాంతకం.
తల్లిపాలు అత్యంత ప్రభావవంతమైనవి:
తల్లిపాలు పిల్లలందరికీ చాలా ముఖ్యమైనవి, కానీ తక్కువ బరువు ఉన్న నవజాత శిశువులకు, ఇది అమృతం కంటే ఎక్కువ అనడంలో అతిశయోక్తి లేదు. తల్లి పాలలో పోషకాలు, యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల శరీర అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. అందువల్ల, శిశువులకు తల్లిపాలు ఇవ్వడం మంచిది. పుట్టినప్పుడు శిశువు బరువు తక్కువగా ఉంటే, అటువంటి పిల్లలకు వీలైనంత ఎక్కువ సార్లు తల్లిపాలు ఇస్తుండాలి. తల్లిపాలలోని ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు, కేలరీల కంటెంట్ శిశువు బరువు పెరుగేందుకు బాగా సహాయపడతాయి. కనుక సాధారణ శిశుల కంటే ఎక్కువ సార్లు వీరికి పాలు ఇవ్వాలి.
పాలు పట్టించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నవజాత శిశువులు బరువు పెరగడానికి తల్లిపాలు కీలకమైనవి. ఎక్కువసార్లు వీరికి పాలు ఇవ్వాలి. అలాగని ఎక్కువ సేపు వీరికి పాలు ఇవ్వకూడదు. ఒకేసారి ఎక్కువ పాలను తీసుకునే శక్తి ఈశిశువులకు ఉండదు. కనుక వీరికి ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో పాలివ్వడం వల్ల బరువు పెరుగుతారు. ఆరోగ్యంగా తయారవుతారు.
పాలివ్వడంలో సమస్యలు..
చాలాసార్లు బిడ్డకు తల్లి పాలివ్వడంలో ఇబ్బంది ఉంటుంది, దీనికి కారణం తల్లి లేదా బిడ్డతో ఎవరిలో అయినా సమస్యలు ఉండచ్చు. కొన్ని సార్లు తల్లికి పాలు ఇవ్వడంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు బిడ్డ పాలు పట్టకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో శిక్షణ పొందిన పాలిచ్చే కన్సల్టెంట్ లేదా చికిత్సకుడి సహాయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వైద్యుడిని సంప్రదించాలి:
తక్కువ బరువు ఉన్న నవజాత శిశువులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. తద్వారా వారి బరువు, శారీరక పెరుగుదలను పర్యవేక్షించవచ్చు. వాటి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
శిశువుపై పరిసరాల ప్రభావం:
తక్కువ జనన బరువు ఉన్న పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి వారికి ఆటంకం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో శిశువు పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత, వెచ్చటి వాతావరణం దెబ్బతినకుండా చూసుకోంది. అస్వస్థతకు గురైన వ్యక్తుల నుంచి వారిని దూరంగా ఉంచండి.
తల్లికి దగ్గరగా ఉండటం:
నవజాత శిశువు బరువు పెరగడానికి తల్లిపాలతో పాలు తల్లి స్పర్ష కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కడుపులో బిడ్డ తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా భావిస్తాడో తల్లి ఒడిలో ఉన్నప్పుడు అంతే సెక్యూర్ గా ఫీలవుతాడు. కనుక బిడ్డకు తల్లి ఎప్పుడూ దగ్గరగా ఉండటం చాలా అవసరం. తల్లి చర్మంతోొ ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నప్పుడు శిశువు తల్లి భావోద్వేగ, శారీరక వెచ్చదనాన్ని అనుభూతి చెందుతుంది. ఇది బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది.
తొందరపాటు వద్దు
నవజాత శిశువుల శరీరం చాలా పెళుసుగా ఉంటుంది. తక్కువ బరువు ఉన్నంత వరకు ఈ వాస్తవంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కాబట్టి మీ బిడ్డ బరువు పెరగడానికి తొందరపడకండి. నెమ్మదిగా, ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి అనుమతించండి.