Hyderabad Formula E race Case : అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దు - హైకోర్టు ఆదేశాలు-telangana high court in interim order has directed that ktr will not be arrested for till december 30 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Formula E Race Case : అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దు - హైకోర్టు ఆదేశాలు

Hyderabad Formula E race Case : అప్పటివరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దు - హైకోర్టు ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 20, 2024 05:47 PM IST

TG High Court On Formula E race Case : ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. డిసెంబర్ 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.

కేటీఆర్ క్వాష్ పిటిషన్ - హైకోర్టులో విచారణ
కేటీఆర్ క్వాష్ పిటిషన్ - హైకోర్టులో విచారణ

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసు విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది.

వాదోపవాదనలు…

ఫార్ములా ఈకార్ రేసింగ్ వ్యవహారంలో తనపై కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించగా.. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.

అక్రమాలు జరిగాయి - ఏజీ వాదనలు

ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసి ఏజీ వాదించారు. ఇది అత్యవసర పిటిషన్‌ విచారణ కాదని చెప్పుకొచ్చారు. FEOకు డబ్బుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని… హెచ్ఎండీఏ ఇందులో భాగస్వామి కాకున్నా రూ.55 కోట్లు చెల్లించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఎవరెవరికి ఎలాంటి లద్ధి చేకూరిందనేది తేలుతుందన్న ఏజీ వాదనలు వినిపించారు.

పీసీ యాక్ట్ వర్తించదు..?

కేటీఆర్‌ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ… అగ్రిమెంట్‌ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 13(1), 409 అనే సెక్షన్లు ఈ కేసుకు వర్తించవన్నారు. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తు లేదని వాదించారు. 18న ఫిర్యాదు చేస్తే 19వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని…. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో పీసీ యాక్ట్ వర్తించదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. పీసీ యాక్ట్‌ ప్రకారం…. డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్లనే నిందితులుగా చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ రేసింగ్ సంస్థకు డబ్బులు అందాయని గుర్తు చేశారు. డబ్బులు తీసుకున్న సంస్థ పేరును ఈ కేసులో చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఇది అవినీతి కేసు ఎలా అవుతుందని వాదనలు వినిపించారు.

"డిసెంబర్ 18న సాయంత్రం 5.30కు ఏసీబీ కేసు నమోదైతే.. డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది.  ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండానే.. కేవలం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.  ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేముందు సరిగ్గా విచారించకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు.  ఎలాంటి నేరపూరితమైన చర్య లేకుండా అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద అసలు కేసు ఎలా నమోదు చేశారు..? ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం సరైనదా కాదా అనే నిర్ణయాన్ని కొత్త (కాంగ్రెస్) ప్రభుత్వం తీసుకోవచ్చు.. కాని అవినీతి నిరోధక చట్టం 13(1)(a) సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి ఆస్కారమే లేదు" అని కేటీఆర్ తరపు న్యాయవాది సీఏ సుందరం వాదించారు.

డబ్బు అందుకున్న ఫార్ములా-ఈ నిర్వాహకులను కనీసం నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొనలేని కేటీఆర్ తరపున న్యాయవాది లెవెనత్తారు. ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఆర్బిట్రేషన్ కేస్ పెండింగ్ ఉందని… కాబట్టే వాళ్లను నిందితులుగా చేర్చలేదని గుర్తు చేశారు. ఈ కేస్‌లో ఇలాంటి లూప్‌హోల్స్ చాలా ఉన్నాయి అని తెలిపారు. “డబ్బు బదిలీ జరిగిన 14 నెలల తర్వాత కేసు పెట్టారు.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేస్ తప్ప ఇంకోటి కాదు. ఒక్క రూపాయి కూడా కేటీఆర్‌కు వచ్చినట్టు రుజువు లేదు, కేస్‌లో అటువంటి ఆరోపణ కూడా లేదు.  వీటన్నింటిని పరిగణిస్తూ.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలి” అని కోర్టును అభ్యంరించారు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… కేటీఆర్ ను డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.

కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు:

మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులను సవాల్ చేస్తూ కేటీఆర్ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కేటీఆర్ విచారించి… ఉత్తర్వులను జారీ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం