Hero Allu Arjun Arrest : హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ - కోర్టు తీర్పుపై ఉత్కంఠ..!
సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయంత్రం 4 గంటలకు విచారణ జరగనుంది.
తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు… క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి కోరారు. ఈ మేరకు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బెంచ్ లో మెన్షన్ చేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని కోరారు. అయితే క్వాష్ పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకు మాత్రమే మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే బుధవారం రోజే పిటిషన్ ఫైల్ చేశామని చెప్పారు. ఇక ఈ పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్…!
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ్నంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్టును కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1)r/w3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తర్వాత అల్లు అర్జున్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఖండించిన కేటీఆర్ - ఏమన్నారంటే
ఇక అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు స్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేయటవం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. హైడ్రా భయంతో ఇద్దరు అమాయక వ్యక్తులు చనిపోయారని… ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌ను కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోయారని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని నిలదీశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ఘటనకు పోలీసులు వైఫల్యమే కారమమని విమర్శించారు.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…
అల్లుఅర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని… చట్టం ముందు అంతా సమానమే అని అన్నారు.
సంబంధిత కథనం