AP TG Weather ALERT : 3 రోజుల్లో మరో 'అల్పపీడనం' - ఏపీకి మరోసారి వర్ష సూచన..!
AP Telangana Weather Updates : డిసెంబర్ 14వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ దానికి అనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం... ప్రస్తుతం లక్షద్వీప్, మాల్దీవుల మీదుగా ఉందని ఐఎండీ తెలిపింది. సంబంధిత ఎగువ వాయు ఉపరితల ఆవర్తనం.. సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని వివరించింది.
డిసెంబర్ 14వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రంపై ఎగువ వాయు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తదుపరి 48 గంటల్లో అది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ - వాయువ్య దిశగా తమిళనాడు తీరాల వైపు కదులుతుందని తాజా బులెటిన్ లో పేర్కొంది.
తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో... ఏపీలోని ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. సీమలో కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వివరించింది.
ఇక ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో…. వాతావరణంలో మరిన్ని మార్పులు అవకాశం ఉంటుంది. దీంతో ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండనుంది.