Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలింపు
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతన్ని గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇటు అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి.. అల్లు అర్జున్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న తీరును తప్పుబట్టారు. ఇది పాలక ప్రభుత్వ అభద్రతా భావానికి పరాకాష్ట అని అభివర్ణించారు. తొక్కిసలాట బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆ విషాదానికి నిజమైన జవాబుదారీతనం ఎవరిదని ప్రశ్నించారు.
'అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును.. చేసిన అతిని ఖండిస్తున్నాను. జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ అసలు తప్పు ఎవరిది? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదు. సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే.. హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రియాక్షన్..
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 'అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
బన్నీ ఇంటికి చిరంజీవి..
అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు, నాగబాబు వెళ్లారు. అర్జున్ అరెస్ట్‌తో చిరంజీవి షూటింగ్ రద్దుచేసుకున్నారు. హుటాహుటిన అర్జున్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా తీశారు. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు నిర్మాత దిల్ రాజు వెళ్లారు. చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.