White Pulihora: అన్నం మిగిలిపోతే కర్ణాటక స్టైల్లో ఇలా తెల్ల పులిహోర చేసేయండి
White Pulihora: అన్నం మిగిలిపోతే నిమ్మరసం, పసుపు వేసి లెమన్ రైస్ చేసుకుంటాము. అలాగే చింతపండు పులిహోర కూడా చేసుకుంటాము. కర్ణాటకలో తెల్లగా ఉండే చిత్రానాన్ని చేస్తారు. చిత్రాన్నం అంటే పులిహోరే.
ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం సహజం. ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు పడేసే కన్నా దాన్ని కొత్తగా ఎలా వినియోగించాలో తెలుసుకోవాలి. మన ఇళ్లల్లో అన్నం మిగిలిపోతే ఎక్కువగా ఎగ్ రైస్, నిమ్మ పులిహోర చేస్తూ ఉంటారు. కర్ణాటకలో కూడా పులిహోరలాగే చిత్రాన్నాన్ని చేస్తారు. వీరు పులిహోరనే చిత్రాన్నం అని పిలుస్తారని అంటారు. అక్కడ తెల్ల చిత్రాన్నాన్ని చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేయకుండా చేసే ఈ చిత్రాన్నం పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి అన్నం మిగిలిపోయినప్పుడు మీరు ప్రయత్నించి చూడండి. మీకు ఇది నచ్చడం ఖాయం.
తెల్ల పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
జీడిపప్పు - గుప్పెడు
ఉల్లిపాయలు - ఒకటి
ఎండుమిర్చి - రెండు
పచ్చిమిర్చి - మూడు
మెంతాకుల తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను
కొబ్బరి తురుము - అరకప్పు
వేరుశెనగ పలుకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాలు - ఐదు
మినప్పప్పు - ఒక స్పూను
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
నూనె - రెండు స్పూన్లు
తెల్ల పులిహోర రెసిపీ
1. ముందుగానే అన్నాన్ని వండి పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో జీడిపప్పులు, వేరుశెనగ పలుకులు వేసి వేయించి రంగు మారేవరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, శెనగపప్పు వేసి వేయించుకోవాలి.
5. వీటన్నింటినీ మీడియం మంట మీదే వేయిస్తే మాడిపోకుండా ఉంటాయి.
6. ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయల తరుగు కూడా వేసి వేయించుకోవాలి.
7. ఉల్లిపాయలపై ఉప్పు జల్లి వేయిస్తే త్వరగా గోధుమరంగు వచ్చేలా వేగిపోతాయి.
8. అందులో తరిగిన మెంతికూర కూడా వేసుకొని రెండు నిమిషాలు పాటు వేయించాలి.
9. మెంతి ఆకుల నుండి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. లేకపోతే ఇవి చేదు రుచిని అందిస్తాయి.
10. తురిమిన కొబ్బరిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
11. ఇప్పుడు వండిన అన్నాన్ని అందులో వేసి పులిహార లాగా కలుపుకోవాలి. పైన నిమ్మ రసాన్ని చల్లుకోవాలి.
12. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, వేరుశెనగ పలుకలను పైన వేసి కలుపుకోవాలి.
13. అంతే టేస్టీ తెల్ల పులిహోర రెడీ అయినట్టే.
14. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీ గా ఉపయోగించుకోవచ్చు. ఇందులో మనం వినియోగించినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.
ఈ తెల్ల చిత్రాన్నాన్ని ఒక్కసారి మీరు తిన్న తిన్నారంటే మరింత ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. కర్ణాటకలో దీన్ని అధికంగా చేసుకుని తింటూ ఉంటారు.