Allu Arjun Arrest Row : అల్లు అర్జున్‌పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు?
Allu Arjun Arrest Row : హైదరాబాద్‌లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా.. 35 ఏళ్ల మహిళ మరణించిన ఘటనపై.. అల్లు అర్జున్, ఆయన భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 4న తన తాజా చిత్రం "పుష్ప-2: ది రూల్" ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి.. ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీ తేజ ఊపిరాడక ఆసుపత్రి పాలయ్యాడు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగింది. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105, 118(1) కింద నటుడు అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బంది, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. మృతురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అసలు ఏం జరిగింది?
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రదర్శనకు అర్జున్ హాజరయ్యారు. సహనటి రష్మిక మందన్న, భార్య అల్లు స్నేహ రెడ్డితో ఆయన వచ్చారు. అప్పుడు తొక్కిసలాట జరిగి, ఒక మహిళా అభిమాని మరణించింది. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు.
పోలీసులు సంధ్య థియేటర్ యజమాన్యంలో ఒకరైన ఎం.సందీప్, సీనియర్ మేనేజర్ ఎం.నాగరాజు, దిగువ బాల్కనీ ఇన్‌చార్జ్ గంధకం విజయ్ చందర్‌లను అరెస్టు చేశారు. అల్లు అర్జున్, అతని భద్రతా బృందంపై 105, 118 (1), ఇతర సంబంధిత భారతీయ న్యాయ సంహిత (BNS) విభాగాల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అర్జున్, సుకుమార్ బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పారు, వైద్య ఖర్చులు, వారికి అవసరమైన ఏదైనా భరిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అర్జున్ రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. 'నా వైపు నుండి, నేను మీకు, ముఖ్యంగా పిల్లలకు అండగా ఉన్నానని నమ్మకం కలిగించడానికే రూ.25 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను' అని అర్జున్ ఒక వీడియో సందేశంలో వెల్లడించారు.