Allu Arjun Arrested LIVE Updates : అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు - విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ..!-actor allu arjun arrested in sandhya theatre stampede case latest live updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun Arrested Live Updates : అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు - విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

హీరో అల్లు అర్జున్ అరెస్ట్

Allu Arjun Arrested LIVE Updates : అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు - విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

05:36 PM ISTDec 13, 2024 11:06 PM Maheshwaram Mahendra Chary
  • Share on Facebook

  • సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. కేసు విచారణ, తీర్పు వివరాల కోసం తాజా లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

Fri, 13 Dec 202405:36 PM IST

శనివారం ఉదయం విడుదల

అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ విడుదల ఉండదని తెలిసింది.

Fri, 13 Dec 202405:27 PM IST

ఆన్ లైన్ లో అర్డర్ కాపీ

అల్లు అర్జున్‌ రిలీజ్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇవాళ విడుదల ఉండకపోవచ్చని వార్తలు వచ్చినప్పటికీ… ఎట్టకేలకు అర్డర్ కాపీ ఆన్ లైన్ లో అప్ లోడ్ అయింది. హైకోర్టు ఉత్తర్వులను జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. అన్ని కుదిరితే ఇవాళే అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు. లేకపోతే శనివారం విడుదల చేస్తారు.

Fri, 13 Dec 202404:48 PM IST

ఇవాళ లేనట్టేనా..?

అల్లు అర్జున్ విడుదల ఇవాళ లేనట్టే తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అరవింద్‌ వెళ్లిపోయారు.

Fri, 13 Dec 202404:05 PM IST

విడుదలపై ఉత్కంఠ

అల్లు అర్జున్ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. ఇప్పటివరకూ తమకు అధికారికంగా బెయిల్ ఉత్తర్వులు అందలేదని జైలు అధికారులు చెబుతున్నారు. బెయిల్ ఉత్తర్వుల కాపీలు ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంచల్ గూడా జైలు ముందు బన్నీ అభిమానాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

Fri, 13 Dec 202404:03 PM IST

అల్లు అర్జున్ అరెస్ట్ - ఆర్జీవీ 4 ప్రశ్నలు

అల్లు అర్జున్ అరెస్ట్ పై దర్శకుడు ఆర్టీవీ స్పందించారు. అధికారులకు నాలుగు ప్రశ్నలు సంధించారు.

-పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా..?

-ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా.. ?

-ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా..?

-భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ?" అని ఆర్జీవీ ప్రశ్నించారు.

Fri, 13 Dec 202403:05 PM IST

బన్నీ ఇంటి వద్దకు భారీగా అభిమానులు

అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Fri, 13 Dec 202402:48 PM IST

సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

హీరో అల్లు అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్ట్ ను పలువురు సీనీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే ఈ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆజ్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది.. దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని చెప్పారు.ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో A11గా పోలీసులు పెట్టారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులు..?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Fri, 13 Dec 202401:45 PM IST

కాసేపట్లో బయటకు….

కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ బయటకు రానున్నారు. బెయిల్‌ పేపర్లతో అల్లు అర్జున్‌ లాయర్లు జైలుకు చేరుకున్నారు. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించనున్నారు. బెయిల్‌ ప్రాసెస్‌ పూర్తి కావడానికి మరో అరగంట సమయం పట్టే అవకాశం ఉంది.

Fri, 13 Dec 202401:11 PM IST

కాసేపట్లో జైలు నుంచి బయటికి…

చంచల్‌గూడ‌ జైల్లో బెయిల్ ఆర్డర్ పేపర్లను సమర్పించడంతో మరికాసేపట్లో అల్లు అర్జున్‌ను జైలు నుండి విడుదల కానున్నారు.

Fri, 13 Dec 202401:09 PM IST

మాజీ మంత్రి అంబటి ట్వీట్

"పద్మవ్యూహం నుండి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు" అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

Fri, 13 Dec 202401:09 PM IST

జైలులోనే అల్లు అర్జున్ - బెయిల్ పత్రాల కోసం వెయిటింగ్

సంధ్య థియేటర్‌ దగ్గర తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్‌ ఉన్నారు. జైలు రిసెప్షన్‌లో కూర్చున్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినందున వెయిట్‌ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న జైలు అధికారులు… బెయిల్ పత్రాలు అందగానే అల్లు అర్జున్ ను విడుదల చేయనున్నారు.

Fri, 13 Dec 202412:59 PM IST

ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని… కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని విమర్శించారు.

Fri, 13 Dec 202412:31 PM IST

హైకోర్టు కీలక వ్యాఖ్యలు…

ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. యాక్టర్‌ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందన్న ధర్మాసనం… కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? అని వ్యాఖ్యానించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని… అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని ప్రస్తావించింది.

Fri, 13 Dec 202412:16 PM IST

అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్

తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ అల్లు అర్జున్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి… అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు.

Fri, 13 Dec 202411:58 AM IST

మధ్యంతర బెయిల్ కోసం వాదనలు

నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ ను ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు ధర్మాసనం ముందు పలు అంశాలను ప్రస్తావించారు.

Fri, 13 Dec 202411:56 AM IST

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అల్లు అర్జున్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. నటుడైన అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చి థియేటర్ కు వెళితే జరిగిన సంఘటనకు ఆయన బాధ్యడవుతారా? అని వ్యాఖ్యానించింది. అల్లు అర్జున్ హీరో కాబట్టి అత్యవసరంగా పిటిషన్‌ విచారణ చేపట్టడం లేదని.. సాధారణ వ్యక్తి పిటిషన్ అయినా విచారిస్తామని పీపీకి స్పష్టం చేసింది.

Fri, 13 Dec 202411:50 AM IST

అల్లు అర్జున్ కు రిమాండ్ - జైలుకు తరలింపు

అల్లు అర్జున్‌ కు నాంపల్లి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడకు తరలించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు.

Fri, 13 Dec 202411:46 AM IST

నా క్లయింట్‌ ఎక్కడకు పారిపోడు - అల్లు అర్జున్ తరపు న్యాయవాది

“బెనిఫిట్‌ షోలపై ప్రభుత్వం 28శాతం జిఎస్టీ వసూలు చేస్తోంది. ఈ షోలతో నిర్మాతకు మాత్రమే లాభం రావట్లేదు. ఈ షోలకు సినిమా నిర్మాతలను మాత్రమే బాధ్యుల్ని చేయలేము. అల్లు అర్జున్‌ షో చూడ్డానికి వస్తున్నాడని రెండు వేర్వేరు అభ్యర్థనల్ని సంధ్యా థియేటర్‌ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు సమర్పించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కేసులో బయటకు కనిపించని విషయం ఇంకేదో ఉంది. అది దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. నా క్లయింట్‌ ఎక్కడకు పారిపోడు. దర్యాప్తుకు సహకరిస్తాడు. నిజానిజాలు దర్యాప్తులో బయటపడతాయి. మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి” అని న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

Fri, 13 Dec 202411:45 AM IST

ఆ షోలకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే - న్యాయవాది నిరంజన్ రెడ్డి

"ప్రీమియర్‌ షోలకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే. బెనిఫిట్‌ షోలతో నిర్మాతకు 10కోట్ల లాభం వస్తుందనుకుంటే, ప్రభుత్వం జిఎస్టీ ద్వారా 3కోట్లు ఆదాయం వస్తుంది. ప్రభుత్వమే పర్మిషన్‌ ఇచ్చి షోలు వేయించి నటుల్ని ఎలా బాధ్యుల్ని చేస్తుంది" అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.

Fri, 13 Dec 202411:39 AM IST

28 శాతం జీఎస్టీ ప్రభుత్వం తీసుకుంటోంది…

టికెట్ రేట్లు పెంచి 28 శాతం జీఎస్టీని ప్రభుత్వం తీసుకుంటోందని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఏదైనా జరిగినప్పుడు తమ బాధ్యత కాదంటోందని వాదనలు వినిపించారు.

Fri, 13 Dec 202411:37 AM IST

పుష్కరాల కేసు ప్రస్తావన

అల్లు అర్జున్ కేసు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. గతంలో ఏపి లో జరిగిన పుష్కరాల కేసును ప్రస్తావించారు. పుష్కరాల సమయంలో అప్పుడు సిఎంగా చంద్ర బాబు అక్కడే ఉన్నారని… తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా లో అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని ప్రస్తావించారు.

Fri, 13 Dec 202411:32 AM IST

అరెస్ట్ అక్రమం - అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు

అల్లు అర్జున్‌ కేసులో హైకోర్టులో వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్‌కు ఎవరి అనుమతి అవసరం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్‌ వెళ్లారని… ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది అక్రమ అరెస్ట్‌ అని తిరస్కరించాలని కోరారు.

Fri, 13 Dec 202411:08 AM IST

వాదనలు వినిపిస్తున్న నిరంజన్ రెడ్డి

అల్లు అర్జున్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

Fri, 13 Dec 202411:07 AM IST

కొనసాగుతున్న వాదనలు

అల్లు అర్జున్ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నమోదైన FIR కొట్టివేయాలని అల్లు అర్జున్‌ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Fri, 13 Dec 202410:49 AM IST

అల్లు అర్జున్ కు రిమాండ్

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలుస్తోంది.

Fri, 13 Dec 202410:50 AM IST

ఏ11గా అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 7 మందిని అరెస్ట్ చేశారు.

Fri, 13 Dec 202410:43 AM IST

క్వాష్ పిటిషన్ పై విచారణ

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అల్లు అరవింద్, త్రివిక్రమ్, దిల్ రాజ్ కోర్టుకు చేరుకున్నారు.

Fri, 13 Dec 202410:41 AM IST

అల్లు అర్జున్ నుంచి సమాచారం లేదు - పోలీసులు

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్నట్టు తన సైడ్ నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని హైదరాబాద్ నగర పోలీసులు తెలిపారు. ఏసీపీ, డీసీపీ ఆఫీస్ కు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

Fri, 13 Dec 202410:38 AM IST

ఆ రోజు ఏం జరిగింది…?

పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటలకే చాలా థియేటర్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లోనూ స్పెషల్ షో వేశారు. ఇక్కడ సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చాడు. అప్పటికే ఈ మూవీ ప్రీమియర్ గురించి ఎన్నాళ్లుగానో అభిమానులు ఎదురు చూస్తుండటంతో సంధ్య థియేటర్ ఆవరణ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయింది. ఆ అభిమానుల్లో రేవతికి చెందిన కుటుంబం కూడా ఉంది. ఆమె, భర్త, ఇద్దరు పిల్లలు పుష్ప 2 ప్రీమియర్ చూడటానికి వచ్చారు. అల్లు అర్జున్ రాకతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరగడం, అందులో ఊపిరాడక రేవతి చనిపోవడం, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు.

Fri, 13 Dec 202410:25 AM IST

అల్లు అర్జున్ పై నమోదైన కేసులు

అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఒక వేళ నేరం రుజువైతే.. అల్లు అర్జున్ కు 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంటుంది.

Fri, 13 Dec 202410:22 AM IST

వివరాలు పరిశీలిస్తున్న న్యాయమూర్తి

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను న్యాయమూర్తి పరిశీలిస్తున్నారు.

Fri, 13 Dec 202410:14 AM IST

కాసేపట్లో హైకోర్టులో విచారణ

అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠను రేపుతోంది.

Fri, 13 Dec 202410:04 AM IST

మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ ను పోలీసులు నాంపల్లి కోర్డుకు తీసుకొచ్చారు. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలిస్తున్నారు.

Fri, 13 Dec 202410:02 AM IST

అరెస్ట్ తీరు దుర్మార్గం - బండి సంజయ్

హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తీరును కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. కనీస సమయం ఇవ్వకుండా.. బెడ్ రూమ్ నుంచి నేరుగా తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. అగౌరవం కలిగించే అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించడం పట్ల సంజయ్ విచారం వ్యక్తం చేశారు, అయితే భారీ జనాన్ని నియంత్రించటంలో ప్రభుత్వమే విఫలమైందని ఆరోపించారు.

Fri, 13 Dec 202410:14 AM IST

అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి

హీరో అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవి దంపతులు చేరుకున్నారు. మరోవైపు నాగబాబు కూడా వచ్చారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Fri, 13 Dec 202409:57 AM IST

నా జోక్యం ఏం ఉండదు - సీఎం రేవంత్ రెడ్డి

అల్లుఅర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని… చట్టం ముందు అంతా సమానమే అని అన్నారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని… తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

Fri, 13 Dec 202409:56 AM IST

ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. ఘటనకు పోలీసులు వైఫల్యమే కారమమని విమర్శించారు.

Fri, 13 Dec 202409:56 AM IST

కేఏ పాల్ రియాక్షన్

అల్లు అర్జున్ అరెస్ట్‌ను కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయారని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోయారని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని నిలదీశారు.

Fri, 13 Dec 202409:56 AM IST

ఖండించిన కేటీఆర్

అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు స్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ను అరెస్ట్‌ చేయటవం.. పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. హైడ్రా భయంతో ఇద్దరు అమాయక వ్యక్తులు చనిపోయారని… ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Fri, 13 Dec 202409:55 AM IST

అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్లు

సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1)r/w3(5) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తర్వాత అల్లు అర్జున్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Fri, 13 Dec 202409:55 AM IST

క్వాష్ పిటిషన్ పై సాయంత్రం విచారణ

తనపై నమోదైన కేసును సవాల్ చేస్తూ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు… క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్‌ ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది.

Fri, 13 Dec 202409:55 AM IST

వైద్య పరీక్షలు పూర్తి

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. ఈ మేరకు కోర్టు వద్ద భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Fri, 13 Dec 202409:55 AM IST

అల్లు అర్జున్ అరెస్ట్

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

WhatsApp channel

టాపిక్