CM Revanth On Allu Arjun Arrest : 'చట్టం ముందు అందరూ సమానులే' - అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే-cm revanth reddy reaction on hero allu arjun arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth On Allu Arjun Arrest : 'చట్టం ముందు అందరూ సమానులే' - అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే

CM Revanth On Allu Arjun Arrest : 'చట్టం ముందు అందరూ సమానులే' - అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే

CM Revanth On Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయ ప్రముఖలు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ… ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని… చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన… చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని… చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని… తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని… కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని విమర్శించారు.

అల్లు అర్జున్ అరెస్ట్ - ఏం జరిగిందంటే.?

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఉన్న అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇంట్లో మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పడంతో షాక్‌‌కు గురయ్యారు. లిఫ్ట్‌లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసుల అనుమతి కోరారు.

పోలీస్ వాహనంలో ఎక్కే ముందు పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసహనం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకోడానికి అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. పోలీసులు తన ఇంటికి రావడం తప్పు కాదని, నేరుగా బెడ్‌రూమ్‌ వరకు వచ్చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను పోలీసులకు సహకరిస్తానని చెప్పారు. ఆ సమయంలో అల్లు అర్జున సతీమణి స్నేహ కూడా అక్కడే ఉన్నారు. పార్కింగ్‌ ఏరియాలో కాఫీ తగిన తర్వాత భార్యను సముదాయించి పోలీస్ వాహనంలో చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ్నుంచి… నాంపల్లి కోర్టుకు తరలించారు.

మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత విచారణ జరగనుంది. అయితే నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠను రేపుతోంది.