Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్టుకు కారణం ఇదే.. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందంటే?
Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్ట్ వార్త సంచలనం రేపుతున్న నేపథ్యంలో అసలు అతని అరెస్టుకు కారణం ఏంటి? పుష్ప 2 ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
Allu Arjun Arrested: అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు అభిమాని మరణానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు బన్నీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అయితే అల్లు అర్జున్ రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగి, తన భార్య కన్నుమూసిందంటూ ఆమె భర్త చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్ దగ్గర ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
పుష్ప 2 ప్రీమియర్.. అసలు ఏం జరిగింది?
పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే అంతకుముందు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 4 రాత్రి 9.30 గంటలకే చాలా థియేటర్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లోనూ స్పెషల్ షో వేశారు. ఇక్కడ సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చాడు. అప్పటికే ఈ మూవీ ప్రీమియర్ గురించి ఎన్నాళ్లుగానో అభిమానులు ఎదురు చూస్తుండటంతో సంధ్య థియేటర్ ఆవరణ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోయింది.
ఆ అభిమానుల్లో రేవతికి చెందిన కుటుంబం కూడా ఉంది. ఆమె, భర్త, ఇద్దరు పిల్లలు పుష్ప 2 ప్రీమియర్ చూడటానికి వచ్చారు. అల్లు అర్జున్ రాకతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరగడం, అందులో ఊపిరాడక రేవతి చనిపోవడం, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడటం తెలిసిందే.
ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన మృతురాలి భర్త
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రీమియర్ చూడటానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లినట్లు మృతురాలు రేవతి భర్త చెప్పాడు. తాము సంధ్య థియేటర్లో ఎన్నో సినిమాలు చూశామని, ఈసారి కూడా అలాగే వెళ్లినట్లు తెలిపాడు. అయితే అక్కడ అంత మంది అభిమానులు ఉంటారని ఊహించలేదని అన్నాడు.
రాత్రి 9.30 సమయంలో అభిమానుల తాకిడి మరీ ఎక్కువ అయిందని, ఆ సమయంలో తన భార్య, కొడుకు ముందుకు వెళ్లిపోయారని, తాను, తన కూతురు వెనుక ఉన్నట్లు చెప్పాడు. తన భార్యకు ఫోన్ చేయగా.. తాను లోనికి వచ్చానని చెప్పిందని అన్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ మూవీ చూడటానికి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారని, దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిపాడు. తాను తర్వాత థియేటర్లోకి తమ సీట్ల దగ్గరికి వెళ్లి చూడగా.. అక్కడ తన భార్య కనిపించలేదని, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు చెప్పాడు.
పోలీసులు కూడా తన భార్య ఇంకా కనిపించలేదని అన్నారని, ఆ తర్వాత తన కొడుకు కిమ్స్ లో ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్తే వెంటిలేటర్ అవసరమైనట్లు డాక్టర్లు చెప్పారని తెలిపాడు. రాత్రి 2 గంటల తర్వాత తన భార్య చనిపోయినట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఒక రోజు తర్వాత స్పందిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. అసలు థియేటర్ దగ్గర అలా జరిగినట్లు తనకు తెలియదని, మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామంటూ రూ.25 లక్షల సాయం ప్రకటించాడు.