Prakasam District : సిమ్ కార్డును హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. లబోదిబోమంటున్న బాధితుడు
Prakasam District : ఫోన్ సిమ్ హ్యాక్ చేసి.. వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగనోట్ల ముఠా రెచ్చిపోతోంది.
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని రావిపాడుకు చెందిన నాగరాజు.. గ్రామంలో ఎరువుల వ్యాపారం చేసుకుంటున్నాడు. బ్యాంకులోని ఆయన ఖాతాలో ఉన్న రూ.5.23 లక్షల నగదును గత నెల 26 రాత్రి నుంచి 27 తెల్లవారుజాములోగా కాజేశారు. ఖాతాలో చూసుకున్న బాధితుడు నగదు పోయిందని గమనించి.. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఐఎంపీఎస్ ద్వారా దొంగిలించిన రూ.2.10 లక్షలను అదే రోజు తిరిగి వచ్చేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే.. నెఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయిన రూ.3.13 లక్షలు తిరిగి రాలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఖాతాలోని డబ్బులు జమ చేసినట్లు గుర్తించారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫోన్ సిమ్ కార్డును నిందితుడు హ్యాక్ చేశాడని, దానికొచ్చే ఓటీపీలను నిందితుడికి వచ్చేలా చేసుకుని.. ఖాతాలోని నగదు కాజేసినట్లు బ్యాంకు మేనేజర్ మాలకొండారెడ్డి తెలిపారు.
నకిలీ నోట్ల ఎరచూపి..
నకిలీ నోట్లను ఎరచూపి రూ.లక్షల్లో దోచేసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. అసలు నోట్లకు బదులుగా రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మబలికి.. నగదు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ జబీర్ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెనికి చెందిన భద్రా జ్యోతికుమార్ స్థానికి జేపీ సెంటర్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకి అదే పట్టణానికి చెందిన మద్దిపాటి కల్యాణ్‌తో కొద్ది రోజుల కిందట పరిచయం ఏర్పడింది. నకిలీ నోట్ల చలామణిలో భాగంగా.. కల్యాణ్ రెండు రూ.500 నోట్లను మార్చకోమని జ్యోతికుమార్‌కి ఇచ్చారు.
ఆ రెండు నోట్లు మారాయి. దీంతో రూ.45 వేలు అసలు కరెన్సీ తీసుకుని.. రూ.95 వేలు నకిలీ నోట్లు ఇచ్చాడు. అనంతరం మరో రూ. 4 లక్షలు తీసుకుని రూ.12 లక్షల నకిలీ నోటల్లు ఇస్తానని నమ్మబలికి పరారయ్యాడు. నకిలీ నోట్లు ఇవ్వాలంటే కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం దాబా వద్దకు రూ. 2 లక్షలు తీసుకురావాలని చెప్పడంతో.. గత నెల 29న జ్యోతి కుమార్ అక్కడకు వెళ్లాడు. డబ్బులు చేతులు మారుతున్న సమయంలో పోలీసులు వస్తున్నారని సైరన్ మోగించి.. జ్యోతికుమార్ వద్ద ఉన్న నగదు తీసుకుని, మరో బ్యాగు చేతిలో పెట్టి నిందితుడు పరారయ్యారు.
కొద్దిసేపటి తరువాత జ్యోతికుమార్ బ్యాగు తెరిచి చూడగా.. అందులో తెలుపు రంగు కాగితాలు ఉన్నాయి. మోసపోయినని గ్రహించిన జ్యోతికుమార్ జంగారెడ్డిగూడెం పోలీసులను ఆశ్రయించారు. జ్యోతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పరారిలో ఉన్న నిందితుడికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి నిందితుడు పోలీసులకు పట్టుపడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)