Eluru Suicide: ఏలూరులో విషాదం.. ఇంటి స్థలం ఆక్రమణతో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య
Eluru Suicide: ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి స్థలాన్ని ఆక్రమించు కుంటున్నారని మనస్తాపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాలిపోయి ఉన్న మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో మృతి చెందింది.
Eluru Suicide: ఇంటి స్థలాన్ని ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది. తన ఇంటి స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన దేవినేని రామతులసి (53)కి గ్రామంలో 493 గజాల స్థలం ఉంది. గుడివాడ మండలం నాగవరపు పాడుకు చెందిన దొడ్డవరపు కోటేశ్వరరావు, ఆయన భార్య నిర్మలాకుమారి రామతులసి రామతులసి సంతకాలను ఫోర్జరీ చేసి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారికి వల్లభనేని సాయికృష్ణ సహకరించారు. ఈ క్రమంలో రామతులసి కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు.
రెండు రోజుల క్రితం ఆ స్థలంలోని మోటారు, కొన్ని వస్తువలను కోటేశ్వరరావు దంపతులు తీసుకెళ్లారు. రామతులసి వారిపై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు దంపతులు రామతులసి, ఆమె కుమారుడిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం కోటేశ్వరరావు, నిర్మలా కుమారి వివాదాస్పద స్థలం వద్దకు వచ్చి, స్థలం లోపలకి వెళ్లేందుకు యత్నించారు. అందుకు రామతులసి అడ్డుకుంది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది.
కోటేశ్వరరావు, నిర్మలా కుమారి దుర్భాషలాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామతులసి తన ఇంటికి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ ఆమె తీవ్రంగా కాలిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 108 వాహనంలో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో రామతులసి మృతి చెందింది.
ఏలూరులో కాల్‌మనీ నిర్వహకులపై కేసు
కాల్‌మనీ గ్యాంగ్‌పై ఏలూరు వన్‌టౌన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏలూరు దక్షిణపు వీధికి ఐలూరి సుబ్బలక్ష్మి భర్తరాజేష్ పౌరహిత్యం చేస్తుంటారు. వీరు ఏలూరుకు చెందిన వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి వద్ద 2011లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించారు. మళ్లీ 2019లో రూ.1.20 లక్షల తీసుకుని ప్రతివారం రూ.5,000 చెల్లిస్తున్నారు.
ఫోన్‌పే ద్వారా మరో రూ.8,75,900 కట్టారు. కానీ అప్పు తీసుకున్న సమయంలో సుబ్బలక్ష్మి తండ్రి నంఉచి కూడా తీసుకున్న చెక్కులు, నోట్లు, తెల్లకాగితాలు అడ్డం పెట్టి అప్పు ఇంకా తీరలేదని కోర్టులో కేసులు వేసి బెదిరిస్తున్నారు.
ఆమె ఇంట్లోని ఏసీ, స్కూటర్, ఇతర వస్తువులను మేడపాటి సుధాకర్ రెడ్డి, ఆయన భార్య లావణ్య, విద్యాసాగర్, రాజేష్, మరి కొందరు కలిసి దౌర్జన్యంగా తీసుకెళ్లారు. సుబ్బలక్ష్మిని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అవమానపరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.