తూర్పుగోదావరి జిల్లాలోని ఈ రెండు గ్రామాలు ఎంతో ఫేమస్, ఇక్కడ షూటింగ్ చేస్తే సినిమా హిట్టు పడడం ఖాయం
తెలుగు సినిమాల్లో అందమైన షూటింగ్ స్పాట్ లు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్న రెండు గ్రామాలు ఎన్నో సినిమాల్లో కనిపిస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయని చెప్పుకుంటారు. ఏదైనా తెలుగింటి సినిమా తీయాలంటే చాలు... తూర్పుగోదావరి జిల్లాకు లేదా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. మనం చూసిన ఎన్నో సినిమాల్లో షూటింగ్స్, పాటల లొకేషన్లు తూర్పుగోదావరి జిల్లాలోనే తీశారని అంటారు. ఒకప్పుడు దర్శకనిర్మాతలంతా ఈ జిల్లాలోని సినిమా షూటింగులు చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పటికీ కూడా ఎన్నో సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలో షూటింగ్లో నిర్వహించుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో రెండు గ్రామాలు ఎక్కువ సినిమాల్లో కనిపిస్తాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కోడూరుపాడు, గుడాల ఈ రెండు గ్రామాలు షూటింగ్ కు ప్రసిద్ధి చెందాయి. కోనసీమ అందాలను, గోదావరి నది వయ్యారాలను ఈ రెండు గ్రామాల్లో చక్కగా చూడవచ్చు. ఎన్నో సినిమాల్లో ఈ రెండు గ్రామాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కాలం నుండే ఈ గ్రామాల్లో షూటింగులు జరపడం మొదలుపెట్టారు. అల్లవరం మండలంలో ఈ రెండు గ్రామాలు ఉన్నాయి. 1962 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల షూటింగులు ఇక్కడ జరిగాయని చెప్పుకుంటారు. వాటిల్లో హిట్టు పడిన సినిమాలు కూడా ఎక్కువే.
కోడూరుపాడు, గుడాల గ్రామంలో ఒక్క చిన్న షాట్ తీసిన చాలు సినిమాకి హిట్టు పడుతుందనే టాక్ ఒకప్పుడు ఉండేది. ఎన్టీ రామారావు, శోభన్ బాబు, బాలకృష్ణ, నాగేశ్వరరావు, కృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ నటులు ఎందరో ఇక్కడ సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించేవారు. ఈ కాలంలో కూడా తెలుగింటి నేటివిటీని చూపించాలనుకుంటే ఈ రెండు గ్రామాలకే దర్శకనిర్మాతలు పరుగులు తీస్తున్నారు. ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగులు నిర్వహించుకున్నాయి.
శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి చిత్రంలో ఎన్నో సన్నివేశాలు ఈ రెండు గ్రామాల్లో తీశారు. బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగులు నిర్వహించుకున్నాయి. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలోని కొన్ని సీన్స్ కోడూరుపాడు లో షూటింగ్ చేశారు. ఈ గ్రామానికి అమీర్ ఖాన్ కూడా వచ్చారు. అలాగే శ్రీనివాస కళ్యాణం, అష్టాచమ్మా వంటి సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ నిర్వహించుకున్నాయి. ఒక్కసారైనా ఈ ప్రాంతాలను చూడడానికి ప్రయత్నించండి. అక్కడి గోదావరి నది, పచ్చని చెట్లు, ఇసుక తిన్నెలు, స్వచ్ఛమైన గాలి మీకు ఎంతో ఉల్లాసాన్ని అందిస్తాయి.