Pawan Kalyan: యాక్షన్ మోడ్‌లో పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లుపై కీలక అప్‌డేట్
Hari Hara Veera Mallu Update: పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికలు, డైరెక్టర్ మారడంతో.. ఈ సినిమా ఆలస్యమైంది. అయితే..?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఏపీ ఎన్నికలు.. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లు ఈ మూవీ షూటింగ్‌కి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ మూవీని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లు థియేటర్లలోకి వస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదటి నుంచీ అడ్డంకులే
ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ నుంచి ఏదో ఒక అడ్డంకులు సినిమాని ఆలస్యం చేస్తున్నాయి. ఏపీ ఎన్నికలు.. ఆ తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమా నుంచి తప్పుకోవడంతో మూవీ లేట్ అయ్యింది. ఇప్పుడు జ్యోతికృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారట.
బాలీవుడ్ స్టార్స్‌తో పవన్
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలానే అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొనగా.. వరుసగా పవన్ కళ్యాణ్ స్టిల్స్‌ను షేర్ చేస్తూ చిత్రయూనిట్ ఆ హైప్‌ను మరింత పెంచుతోంది.
పవన్ నిరీక్షణ ఫలించేనా?
పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలంగా గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది లాంటి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్, బీమ్లా నాయక్ హిట్‌గా నిలిచినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లని రాబట్టలేకపోయాయి. దాంతో హరిహర వీరమల్లు ద్వారా ఆ కమర్షియల్ హిట్ లోటుని భర్తీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సింగిల్‌గా సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. 2023లో బ్రో వచ్చినా అది మల్టీస్టారర్ కావడంతో.. పవన్ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.