NREGA Work Scam : కరవు పనుల్లోనూ కక్కుర్తి, పక్కదారి పడుతున్న ఉపాధి హామీ నిధులు
NREGA Work Scam : గ్రామీణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతోంది. కాదేదీ అవినీతికి అనర్హం అనే రీతిలో కొందరు అధికారులు ఉపాధి నిధుల స్వాహా చేస్తున్నారు. కరవు పనుల్లో కూడా కక్కుర్తి పడుతున్నారు.
NREGA Work Scam : దేశంలోని గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో, అన్ స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA) ప్రారంభిచింది కేంద్ర ప్రభుత్వం. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పిస్తారు. ఇందుకు గానూ జాబ్ కార్డులు జారీ చేస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, అట్టడుగు వర్గాల పేదలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే పనుల ద్వారా వేతన ఉపాధిని కల్పించి, ప్రజల జీవన భద్రతను పెంపొదిస్తారు. ఉపాధి హామీ పథకానికి అధిక శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది.
తక్షణ ఆర్థిక సాయం
ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ పేదలకు తక్షణ ఆర్థిక సాయం లభిస్తుంది. కరవు సమయాల్లో ఉపాధి పనులు అండగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో కాలువలు, రహదారుల అభివృద్ధి, నీటి వసతుల నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫై చేసిన దాదాపు 250కి పనులను ఈ పథకం ద్వారా చేపడుతున్నారు. సరైన విధంగా అమలు చేస్తే అద్భుతాలు సృష్టించగల ఈ పథకాన్ని కొందరు అక్రమార్కుల వల్ల పక్కదారి పడుతుంది. వీటిల్లో నిధుల దారి మళ్లింపు ఒకటైతే, అక్రమార్కుల అవినీతి మరొకటి. ఇందుకు ఇటీవల జరుగుతున్న ఘటనలే నిదర్శనం. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన అవినీతిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు.
క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉపాధి హామీ నిధులు స్వాహా చేసేందుకు అక్రమార్కులు కాపుకాస్తున్నారు. లేని జాబ్ కార్డులు సృష్టించేది కొందరైతే, వాటాల చొప్పున పంచుకునేది మరికొందరు. పనిచేయకపోయినా చేసినట్లు రాసి ఉపాధి నిధుల స్వాహా చేసిన ఘటన ఇటీవల నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 2022-23లో నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జరిగిన అవినీతిపై 8 మంది సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గత ఐదేళ్లుగా ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిలో నమోదైన మొదటి ఎఫ్‌ఐఆర్ ఇదే. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం అవినీతిపై విచారణకు ఆదేశించారు. చీఫ్ విజిలెన్స్ అధికారిగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నియమించి ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఉపాధి పనుల్లో భారీగా అవినీతి
నెల్లూరు జిల్లా కలువాయి మండలం చినగోపవరం పంచాయతీలో ఉపాధి పనుల్లో భారీ అవినీతి వెలుగుచూసింది. సోషల్ ఆడిట్ లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఒక్క మండలంలోనే రూ.60 లక్షలకు పైగా అవినీతి జరిగిందని అధికారులు తేల్చారు. ఒక చినగోపవరం పంచాయతీలోనే రూ.50 లక్షల వరకు అక్రమార్కులు దోచేశారు. గ్రామంలో లేకపోయినా, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను జాబ్ కార్డులు సృష్టించిన ఫీల్డ్ అసిస్టెంట్ రూ.27.45 లక్షలను స్వాహా చేశాడు. ఆ మండలంలోని ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రూ.13.79 లక్షలు, టెక్నికల్ అసిస్టెంట్లు రూ.9.63 లక్షలు, రూ.3.73 లక్షలు, రూ.2.70 లక్షలు చొప్పున స్వాహా చేశారు. ఇప్పటికే ఈ అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ అవినీతికి సంబంధించి 8 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
విజిలెన్స్ తనిఖీలు
గ్రామాల్లో లేని వ్యక్తులకు జాబ్ కార్డులు సృష్టించి లక్షలు అవినీతికి పాల్పడుతున్నారు. ఉన్న జాబ్ కార్డుల్లో కూడా వాటాలు, కమిషన్లు ఇలా క్షేత్ర స్థాయి నుంచే అవినీతి భాగోతం మొదలవుతుంది. ఒక చిన్న గ్రామంలోనే రూ.50 లక్షలకు పైగా అవినీతి జరిగిన ఘటన వెలుగు చూడడంతో... రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో నిధులు స్వాహా చేశారో అన్న అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. కరవు పనిలో కూడా అవినీతి అధికారులు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల విజిలెన్స్ తనిఖీలు మమ్మురం కావడంతో ఉపాధి పథకం సిబ్బంది, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిధుల రికవరీతో పాటు అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది.
సంబంధిత కథనం