Karivepaku Chutney: కరివేపాకు పచ్చడి ఇలా స్పైసీగా చేసుకుని ఇడ్లీ, దోశె తింటే అదిరిపోతుంది
Karivepaku Chutney: కరివేపాకు పచ్చడిని టేస్టీగా చేసుకుంటే దాన్ని అన్నం, ఇడ్లీ, దోశె వంటి వాటితో తినవచ్చు. దీన్ని చాలా సులువుగా చేసుకోవచ్చు. కరివేపాకు చట్నీని ఎలా చేయాలో తెలుసుకోండి.
కరివేపాకులో ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. కానీ వాటిని తినే ముందు తీసిపడేసే వారే ఎక్కువ మంది. కరివేపాకులను తింటే మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు అధికంగా లభిస్తాయి. కరివేపాకు వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందుతాయి. కరివేపాకులు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. కాలేయాన్ని కాపాడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. గాయాలను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. కరివేపాకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. వీటిని భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, అండమాన్ దీవులలో పండిస్తారు. దీనిని భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఇది ఇప్పుడు ఆస్ట్రేలియా, పసిఫిక్ ద్వీపాలు, ఆఫ్రికాల్లో పండించి వాడుతున్నారు. ఇన్ని ప్రయోజనాలను అందించే కరివేపాకును ఆరు నెలల వరకు ఉంచుకోవచ్చు. దీన్ని తినడం వల్ల మీ శరీరానికి ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి.
కరివేపాకు పచ్చడి రెసిపీకి కావల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు - రెండు
అల్లం - చిన్న ముక్క
కరివేపాకులు - ఒక కప్పు
నూనె - సరిపడినంత
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక స్పూను
కొబ్బరి తురుము - ఒక స్పూను
ఎండు మిర్చి - పది
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకుల పచ్చడి రెసిపీ
- కరివేపాకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో కరివేపాకులను వేసి వేయించాలి.
- అందులో కొబ్బరి తురుమును కూడా వేసి వేయించాలి. అందులో ఎండు మిర్చి కూడా వేయించాలి.
- పైన ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్నిమిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయాలి.
- అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, రెండు ఎండు మిర్చి, మినపప్పు వేసి వేయించాలి.
- ఆ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిపై వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయినట్టే.
కరివేపాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. అలాగే ఇడ్లీ, దోశతో తిన్నా టేస్టీగా ఉంటుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే పెద్దలకు బాగా నచ్చుతుంది. అదే పిల్లలకైతే కారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెరుగన్నం తింటూ కరివేపాకు పచ్చడిని తింటే రుచి అదిరిపోతుంది.