Zero Oil Puri Recipe: నూనె లేకుండా హెల్దీగా పూరీలు.. ఎలా తయారు చేసుకోవాలంటే!-zero oil puri recipe make this puris without oil like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zero Oil Puri Recipe: నూనె లేకుండా హెల్దీగా పూరీలు.. ఎలా తయారు చేసుకోవాలంటే!

Zero Oil Puri Recipe: నూనె లేకుండా హెల్దీగా పూరీలు.. ఎలా తయారు చేసుకోవాలంటే!

Zero Oil Puri Recipe: నూనె ఏ మాత్రం వాడకుండా పూరీలు చేయవచ్చు. ఇటీవల ఈ జీరో ఆయిల్ పూరీలు బాగా పాపులర్ అవుతున్నాయి. మరి నూనె లేకుండా పూరీలు ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Zero Oil Puri Recipe: నూనె లేకుండా హెల్దీగా పూరీలు.. ఎలా తయారు చేసుకోవాలంటే!

పూరీలు అంటే చాలా మందికి ఎంతో ఫేవరెట్‍ టిఫిన్‍గా ఉంటుంది. బ్రేక్‍ఫాస్ట్‌లో పూరీలు తినేందుకు చాలా ఇష్టపడతారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉన్న వారు పూరీలను ఎక్కువగా తినకూడదని అనుకుంటారు. పూరీలను నూనెలో వేయించడమే ఇందుకు కారణం. నూనె వల్ల పూరీల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే, నూనె ఎక్కువగా ఉందని పూరీలు తినని వారి కోసం కొత్తగా ఓ ట్రెండ్ పాపులర్ అవుతోంది. అదే జీరో ఆయిల్ పూరీ. నో ఆయిల్ పూరీ అని కూడా దీన్ని అంటున్నారు. అంటే చుక్క నూనె లేకుండా పూరీలు చేసుకోవచ్చు.

నూనెల లేకుండా పూరీలు చేసుకోవడం సులభమే. నూనె వాడకపోవడంతో కడుపుకు ఇవి లైట్‍గానూ ఉంటాయి. వీటిని తయారు చేసుకునేందుకు ఎయిర్‌ఫ్రయర్ ఉండాలి. మరి ఈ జీరో ఆయిల్ పూరీలను ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

జీరో ఆయిల్ పూరీకి కావాల్సిన పదార్థాలు

  • ఓ కప్పు గోధుమ పిండి
  • రెండు టేబుల్ స్పూన్‍ల పెరుగు
  • తగినంత ఉప్పు
  • పిండి కలుపుకునేందుకు నీరు

జీరో ఆయిల్ పూరీల తయారీ విధానం

  1. ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో పెరుగు వేసి కలుపుకోవాలి. అనంతరం దాంట్లో కాస్తకాస్త నీరు పోసుకుంటూ పిండిని బాకా కలుపుకోవాలి. పిండిని కాస్త సాగే వరకు ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలి.
  2. పిండిని బాగా కలుపుకున్నాక.. దానిపై గిన్నె మూసి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టాలి.
  3. ఆ తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటిని కాస్త మందంగానే పూరీల్లా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి.
  4. ఆ తర్వాత స్టవ్‍పై ఓ గిన్నెలో నీటిని బాగా వేడిచేసుకోవాలి. మరుగుతున్న నీటిలో పూరీలను ఒక్కొక్కటిగా వేయాలి. నీటిలో సుమారు రెండు నిమిషాలు పూరీని ఉడకనివ్వాలి. నీటిపై తేలగానే బయటికి తీసేయాలి. అలా చేసుకున్న అన్ని పూరీలను ఒకదాని తర్వాత ఒకటి నీటిలో ఉడకబెట్టాలి.
  5. నీటిలో ఉడికించిన పూరీలపై తేమను తుడిచేసి పొడిగా చేయాలి.
  6. ఆ పూరీలను ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టాలి. సుమారు 180 డిగ్రీల హీట్ సెట్ చేసి ఐదు నిమిషాల పాటు పెట్టుకోవాలి.
  7. ఎయిర్ ఫ్రయర్‌లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పూరీలు పెట్టవచ్చు. అయితే, ఒకదానిపై ఒకటి ఉండకుండా జాగ్రత్త పడాలి.
  8. 180 డిగ్రీల వద్ద 4 నిమిషాల పాటు ఎయిర్ ఫ్రయర్‌లో పూరీని కాల్చుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ఎక్కువగా కుక్ కాకుండా చూసుకోవాలి.
  9. ఎయిర్ ఫ్రయర్‌లో సుమారు 4 -5 నిమిషాలు ఉంచాక పూరీలు పొంగి రెడీ అవుతాయి. బయటికి తీసి కర్రీతో తీనేేయవచ్చు.