Stock market crash: ఈ వారం 4,000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్; ఈ పతనానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
Stock market crash: శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తో ట్రేడింగ్ వీక్ ముగిసింది. ఈ వారం ఇన్వెస్టర్లను భారీగా దెబ్బతీసింది. ఈ వారంలో సెన్సెక్స్ 4,000 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 50 200 రోజుల సగటు సుమారు 23,700 కు చేరుకుంది. మొత్తంగా భారత స్టాక్ మార్కెట్ ఈ వారం గణనీయమైన నష్టాలను చవిచూసింది.
Stock market crash: భారత స్టాక్ మార్కెట్ ఈ వారం భారీ నష్టాలతో ముగిసింది. బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఈ వారం 4,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 200 రోజుల ఎక్స్ పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ) 23,700 దిగువకు పడిపోయింది. డిసెంబర్ 20, శుక్రవారం, సెన్సెక్స్ 79,218.05 వద్ద ప్రారంభమై, 1,200 పాయింట్లు లేదా 1.6 శాతం క్షీణించి 77,972.68 వద్ద అత్యంత కనిష్టానికి పడిపోయింది. నిఫ్టీ 50 23,960.70 వద్ద ప్రారంభమై, దాదాపు 400 పాయింట్లు లేదా 1.6 శాతం క్షీణించి 23,565 వద్ద ముగిసింది.
నష్టాల్లో లార్జ్ క్యాప్స్
టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (hdfc bank) వంటి ఇండెక్స్ హెవీవెయిట్స్ శుక్రవారం సుమారు 1-3 శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా గత ఐదు సెషన్లలో పతనమవుతున్నాయి. శుక్రవారం కనిష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సెన్సెక్స్ ఇప్పుడు ఈ వారం 4,000 పాయింట్లు లేదా 5 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ 50 కూడా ఈ వారం 5 శాతం నష్టంతో ముగించింది.
భారత స్టాక్ మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ పతనానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి..
1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత దృక్పథం
ఫెడ్ తన రేట్లను సవరించింది. 2025 చివరి నాటికి మూడు లేదా నాలుగు రేట్ల కోతలపై మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా మరో రెండు రేట్ల కోతలను మాత్రమే అంచనా వేసింది. ఇది ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ‘‘అమెరికా ఫెడ్ మార్గదర్శకత్వం తర్వాత ప్రపంచ సెంటిమెంట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. దేశీయంగా మరింత పటిష్టమైన ఆర్డర్, టెండర్ల కోసం వేచి చూస్తున్నాం. అంతర్జాతీయ, దేశీయ అంశాల సమ్మేళనమే మార్కెట్ పతనానికి కారణమవుతోంది’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే అన్నారు.
2. విదేశీ మూలధన ప్రవాహం
ఫెడ్ నిర్ణయం అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ ను బలోపేతం చేయడంతో పాటు విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసింది. డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు ఉండటంతో గత నాలుగు సెషన్లలో ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) రూ.12,000 కోట్లకు పైగా విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. ‘‘డిసెంబర్ ప్రారంభంలో చూసిన ఎఫ్ఐఐ కొనుగోళ్లు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. ఈ వారం అమ్మకాలు రూ.12,229 కోట్లకు చేరుకున్నాయి. ఎఫ్ఐఐ వ్యూహంలో ఈ మార్పు మార్కెట్ ధోరణుల్లో (stock market psychology) కూడా ప్రతిబింబిస్తోంది. ఎఫ్ఐఐ అమ్మకాల కారణంగా లార్జ్ క్యాప్స్, ముఖ్యంగా ఫైనాన్షియల్స్ ఒత్తిడికి గురవుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.
3. స్థూల ఆర్థిక ఆందోళనలు
క్షీణిస్తున్న దేశీయ స్థూల ఆర్థిక ముఖ చిత్రంపై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. అంతేకాకుండా, నవంబర్లో దేశ వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగింది. మొత్తం మీద ఆర్థిక వృద్ధి కూడా మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ క్యూ2 జీడీపీ దాదాపు రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత ఆర్థిక వృద్ధి వరుసగా మూడో త్రైమాసికంలో మందగించింది.
4. ఆదాయాల రికవరీపై అనిశ్చితి
భారత కార్పొరేట్ల బలహీనమైన క్యూ1, క్యూ2 ఆదాయాల తర్వాత అందరి దృష్టి డిసెంబర్ త్రైమాసికం (Q3) రాబడులపై పడింది. క్యూ3 నుంచి కోలుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, పెరిగిన వడ్డీరేట్ల కారణంగా, ఆ పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్ (stock market) రికవరీ అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ‘‘చమురు, గ్యాస్ వంటి అతిపెద్ద దెబ్బతిన్న రంగాలు త్రైమాసిక ప్రాతిపదికన కొంత మెరుగుపడటం వల్ల క్యూ3లో కొంత రికవరీ ఉంటుందని భావిస్తున్నాం. పండుగ సీజన్ కూడా ఉంది. కాబట్టి, త్రైమాసిక వృద్ధి గణాంకాలు మెరుగ్గా ఉండటానికి అవకాశముంది’’ పాండే అన్నారు.
5. హెవీవెయిట్ రంగాల పేలవ ప్రదర్శన
బ్యాంకింగ్ (banking), ఐటీ, (information technology), ఫైనాన్షియల్స్ వంటి హెవీవెయిట్ రంగాలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదని, ఇది మార్కెట్ బెంచ్ మార్క్ లను దిగజార్చుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో పెద్ద రంగాలు ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని, అందుకే మార్కెట్లు బలహీనతను ప్రదర్శిస్తున్నాయని పాండే అన్నారు.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు మరియు బ్రోకరేజీ సంస్థలవి. హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.