Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ఫార్ములా ఈ కార్ రేసు ప్రకంపనలు సృష్టించింది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు.
ప్రతిపక్షం సహనం కోల్పోయిందని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా.. స్పీకర్ ఓపికతో వ్యవహరించారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
'భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారు. అధికారం, అహంకారంతో.. కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారు. భూమి కోసం సకల జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయి. చట్టాలతో యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నాం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను పీవీ తీసుకొచ్చారు. ఇందిరా హయాంలో అసైన్‌మెంట్ భూముల పంపిణీ జరిగింది. యూపీఏ హయాంలోనే.. భూభారతి పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టారు' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు బీఏసీలో ఎందుకు అడగలేదు. మూడు నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోంది. ప్రమాణస్వీకారం చేసినప్పుడే.. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని నాతో చెప్పారు. నన్ను కలిసిన వాళ్లతో ఫొటో దిగుతుంటా. అలాగే ఎఫ్ఈవో వాళ్లతో కూడా ఫొటో దిగా. వీళ్ల ఒప్పందం రూ.600 కోట్లు. ప్రభుత్వం మారడంతో రూ.55 కోట్లతో ఆపాం' అని రేవంత్ వివరించారు.
బీఆర్ఎస్ నిరసనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు అని అభివర్ణించారు. ఓ కుటుంబం కోసమే బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందన్నారు. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే బీఆర్ఎస్ సంస్కృతి.. కేసీఆర్ నేర్పించింది ఇదే.. ఒక ఎమ్మెల్యే కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌కు ప్రజలు అవసరం లేదు.. పార్టీనే ముఖ్యం అని అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
'శాసనసభలో ఈరోజు చీకటి రోజు. దళిత స్పీకర్‌ను అవహేళన చేస్తూ పేపర్లు వేశారు. కౌశిక్‌రెడ్డి అగ్రకుల అహంకారం చూపించారు. స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలతోనే సంపత్, కోమటిరెడ్డిని.. శాసనసభ నుంచి బయటకు పంపిచారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు' అని వేముల వీరేశం ప్రశ్నించారు.