Google layoffs: గూగుల్ లో మళ్లీ లే ఆఫ్స్; ఆ కేటగిరీలో 10% ఉద్యోగాల కోత
Google layoffs: గూగుల్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. లేటెస్ట్ గా మరోసారి గూగుల్ లో ఉద్యోగాల కోతపై ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. పెరుగుతున్న కృత్రిమ మేధ పోటీకి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..
Google layoffs: డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో సహా మేనేజిరియల్ రోల్స్ లో 10 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం ప్రకటించారు. ఓపెన్ ఏఐ వంటి సంస్థల నుంచి కృత్రిమ మేధ లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో గూగుల్ తో పాటు పలు కంపెనీలు లే ఆఫ్స్ బాట పడుతున్నాయి.
మేనేజిరియల్ కేటగిరీలో..
గూగుల్ గత కొన్ని సంవత్సరాలుగా సంస్థాగతంగా మార్పులు చేస్తోందని, అందులో భాగంగానే మ్యాన్ పవర్ ను తగ్గించి, సంస్థ కార్యకలాపాలను సమర్ధవంతం, సరళతరం చేసే ప్రయత్నాలు చేస్తోందని సుందర్ పిచాయ్ చెప్పినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని వ్యక్తులు తెలిపారు. తమకు మీడియాతో మాట్లాడటానికి అధికారం లేనందున తమ పేర్లు చెప్పలేమని వారు కోరారు. తాజా లే ఆఫ్ (layoffs) ప్రతిపాదనలో మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లలో 10 శాతం కోత విధించినట్లు సుందర్ పిచాయ్ తెలిపారని వారు చెప్పారు. ఆ 10% లో కొందరిని వేరే బాధ్యతల్లోకి తీసుకున్నారు. కొందరిని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారు.
గత కొన్నేళ్లుగా ఎఫిషియెన్సీ డ్రైవ్ లో..
గత కొన్నేళ్లుగా గూగుల్ సంస్థ ఎఫిషియెన్సీ డ్రైవ్ లో ఉంది. గూగుల్ 20% మరింత సమర్థవంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని సెప్టెంబర్ 2022 లో పిచాయ్ స్పష్టం చేశారు. ఆ తరువాత, 2023 జనవరిలోనే కంపెనీ నుంచి 12,000 ఉద్యోగాలను తొలగించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక మందిని తొలగించిన లే ఆఫ్. ఓపెన్ఏఐ వంటి ఏఐ ప్రత్యర్థులు గూగుల్ సెర్చ్ బిజినెస్ కు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది.
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
గూగుల్ (google) తన ప్రధాన వ్యాపారాల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను చొప్పించడం ద్వారా ఇతర ఏఐ కంపెనీలను ఎదుర్కొంటోంది. ఓపెన్ఎఐ వంటి ఏఐ సంస్థల దూకుడును అధిగమించడానికి గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే, కొత్త ఏఐ వీడియో జనరేటర్, దాని ఆలోచనా విధానాన్ని చూపించే "రీజనింగ్" మోడల్తో సహా కొత్త జెమినీ మోడళ్లను ప్రారంభించింది. ఆధునిక గూగుల్ కోసం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని బుధవారం జరిగిన స్టాఫ్ మీటింగ్ లో సుందర్ పిచాయ్ సిబ్బందికి చెబుతూ "గూగ్లీనెస్ (Googleyness)" అనే పదం యొక్క అర్థాన్ని కూడా వివరించారు.