ప్రపంచ లీడింగ్ టెక్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. ఇక్కడ ఉద్యోగం చేయాలని చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కలలు కంటూ ఉంటారు. అయితే, అసలు గూగుల్‌లో జాబ్ సంపాదించాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? మనలో ఏం చూసి జాబ్ ఆఫర్ చేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని చాలా మంది యువత, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న భావిస్తుంటారు. తాజాగా గూగుల్‌లో ఉద్యోగానికి సంబంధించి సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ సమాధానం ఇచ్చారు.
గూగుల్ కొత్త నియామకాల్లో, ముఖ్యంగా ఇంజనీరింగ్ రోల్స్‌లో ఉద్యోగాల కోసం అభ్యర్థి నుంచి ఏం చూస్తుందో సుందర్ పిచాయ్ తాజాగా వెల్లడించారు. డేవిడ్ రూబెన్ స్టీన్ షో, పీర్ టు పీర్ కన్వర్జేషన్స్‌లో పిచాయ్ మాట్లాడుతూ.. అభ్యర్థులు సాంకేతికంగా నైపుణ్యం, అడాప్టబుల్గా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. శరవేగంగా మారుతున్న టెక్ వాతావరణంలో అభివృద్ధి చెందగల సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎల్లప్పుడూ అన్వేషిస్తుందని ఆయన అన్నారు.
క్రియేటివిటీ, ఇన్నోవేష్ని పెంపొందించడంలో గూగుల్ వర్క్ కల్చర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా.. ఉచిత భోజనాన్ని అందించే సంస్థ సంప్రదాయాన్ని పిచాయ్ ఎత్తిచూపారు. ఇది సమాజాన్ని నిర్మించడానికి, కొత్త ఆలోచనలను రేకెత్తించడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్‌లో తన తొలినాళ్ల అనుభవాలను పంచుకున్న ఆయన, కేఫ్‌లో అనుకోని సంభాషణలు తరచూ ఉత్తేజకరమైన ప్రాజెక్టులకు ఎలా దారితీశాయో గుర్తు చేసుకున్నారు!
"ఈ కార్యక్రమాల విలువ.. భోజనం ఖర్చుల కంటే చాలా ఎక్కువ," అని సుందర్ పిచాయ్ వివరించారు.
టెక్ జాబ్ మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ, గూగుల్ ప్రతిభావంతులకు అగ్ర గమ్యస్థానంగా నిలుస్తోంది. జూన్ 2024 నాటికి ఈ సంస్థలో 1,79,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని సుందర్ పిచాయ్ అన్నారు. తమ ఆఫర్‌ని దాదాపు 90% మంది అంగీకరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమ అంతటా నియామకాల మందగమనం కనిపిస్తున్న సమయంలో గూగుల్‌లో ఉద్యోగం పొందడం కష్టమని ఆయన అంగీకరించారు. అయితే ఈ పరిస్థితిని సంస్థ ఎదుగుదలకు ముడిపెట్టి, "ప్రతిష్ఠాత్మక విజయం" గా అభివర్ణించారు.
గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్ కూడా సంస్థ నియామక ప్రక్రియపై అవగాహన కల్పించారు.
“గూగుల్ విలువలు, మిషన్‌ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావాలని అభ్యర్థులకు నా సలహా. దరఖాస్తుదారులు తమ ప్రేరణను ప్రదర్శించడానికి, కంపెనీ సంస్కృతికి తగినట్లుగా వారి విజయాల ఉదాహరణలను తీసుకెళ్లాలి,” అని నోలన్ చర్చ్ సిఫార్సు చేశారు.
“మీరు రియలిస్టిక్‌గా ఉన్నంతవరకు నెగోషియేషన్స్ కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. ఒరిజినల్ ఆఫర్ కంటే 40% నుంచి 100% ఎక్కువ అడగడం రిక్రూట్మెంట్ టీమ్‌కు రెడ్ అలర్ట్ అవుతుంది. ఓసారి మేము ఎంట్రీ లెవల్ అభ్యర్థికి ఆఫర్ ఇచ్చాము. అతను రెట్టింపు జీతం అడిగాడు. ఇది హాస్యాస్పదమైన నెంబర్. దీనికి ఎటువంటి డేటా మద్దతు లేదు. కాబట్టి మేము ఆఫర్‌ని రద్దు చేశాము. జీతం విషయంలో అభ్యర్థి ఎలాంటి రీసెర్చ్ చేయలేదని స్పష్టమైంది,” అని చర్చ్ తెలిపారు.
సంబంధిత కథనం