Ravindra Jadeja: రోహిత్, కోహ్లీని ఫాలో అయిన రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టార్ ఆల్‍రౌండర్-ravinda jadeja announces retirement from t20is after rohit sharma and virat kohli ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravindra Jadeja: రోహిత్, కోహ్లీని ఫాలో అయిన రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టార్ ఆల్‍రౌండర్

Ravindra Jadeja: రోహిత్, కోహ్లీని ఫాలో అయిన రవీంద్ర జడేజా.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టార్ ఆల్‍రౌండర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 30, 2024 05:33 PM IST

Ravindra Jadeja T20I retirement: భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్‍బై చెప్పగా.. వారినే జడ్డూ ఫాలో అయ్యాడు.

Ravindra Jadeja: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఫాలో అయిన రవీంద్ర జడేజా.. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టార్ ఆల్‍రౌండర్
Ravindra Jadeja: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఫాలో అయిన రవీంద్ర జడేజా.. టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన స్టార్ ఆల్‍రౌండర్

Ravindra Jadeja: అంతర్జాతీయ టీ20లకు భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‍ను టీమిండియా కైవసం చేసుకున్న రోజు వ్యవధిలోనే నేడు (జూన్ 30) ఈ నిర్ణయం ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో శనివారం (జూన్ 29) దక్షిణాఫ్రికాపై 7 పరుగులతో తేడాతో విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది భారత్. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున టీ20లకు వీడ్కోలు చెప్పారు. వారినే ఫాలో అయ్యాడు రవీంద్ర జడేజా.

కల నెరవేరింది అంటూ..

టీ20 ప్రపంచకప్ అనేది తన కల అని, అది నెరవేరిందని తన టీ20 రిటైర్మెంట్‍ను నేడు సోషల్ మీడియా వేదికగా రవీంద్ర జడేజా వెల్లడించాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలో అత్యుత్తమైన ప్రదర్శన చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను చేతబట్టుకున్న ఫొటోను పోస్ట్ చేసి.. క్యాప్షన్ రాశాడు రవీంద్ర జడేజా. తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని తెలిపాడు. “సంతోషం నిండిన హృదయంతో నేను అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెబుతున్నా. గర్వంతో దూసుకెళ్లే గుర్రంలా నేను ఎప్పుడు దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు కృషి చేశాను.. ఇక మిగిలిన ఫార్మాట్లలో దాన్ని కొనసాగిస్తాను. టీ20 ప్రపంచ కప్ గెలువడం నా కల. అది నెరవేరింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‍లో ఇది చాలా అత్యుత్తమమైనది. ప్రోత్సాహం, ఎనలేని మద్దతు ఇచ్చిన వారికి ధన్యవాదాలు” అని సోషల్ మీడియాలో రవీంద్ర జడేజా పోస్ట్ చేశాడు.

జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్

భారత్ తరఫున 74 టీ20లు ఆడాడు రవీంద్ర జడేజా. 21.45 యావరేజ్, 127.16 స్ట్రైక్‍రేట్‍తో 515 పరుగులు చేశాడు. 54 వికెట్లను పడగొట్టాడు. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.

అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా తరఫున ఇక వన్డేలు, టెస్టు ఫార్మాట్లు ఆడనున్నాడు జడేజా.

రవీంద్ర జడేజా 2009 నుంచి 2024 మధ్య ఏడుసార్లు టీ20 ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. తన 74 అంతర్జాతీయ టీ20ల్లో 30 ప్రపంచకప్‍ల్లోనే బరిలోకి దిగాడు. కొన్ని మ్యాచ్‍ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది 2024 టీ20 టోర్నీలో జడేజా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 8 మ్యాచ్‍ల్లో 35 పరుగులే చేసి.. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చేందుకు అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నాడు.

ముగ్గురు వీడ్కోలు

దక్షిణాఫ్రికాను తుదిపోరులో ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్‍ను 17ఏళ్ల తర్వాత మళ్లీ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‍లో కీలకమైన అర్ధ శకతం చేసి గెలుపులో కీలకపాత్ర పోషించిన భారత స్టార్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆ అవార్డు అందుకునే సమయంలోనే అంతర్జాతీయ టీ20లకు తాను వీడ్కోలు చెబుతున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. భారత్‍కు చివరి టీ20 ఆడేశానని అన్నాడు. తాను అంతర్జాతీయ టీ20 నుంచి వైదొలుగుతున్నానని టైటిల్ అందుకున్న కాసేపటికే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకు అంతర్జాతీయ టీ20లకు జడేజా గుడ్‍బై చెప్పాడు. ఇక, భారత్ తరఫున ఈ ముగ్గురు టెస్టులు, వన్డేలు ఆడనున్నారు.

WhatsApp channel